ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని విద్య, ఐటి, ఎలక్ర్టానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏడాదిలోగా వన్‌స్టార్ పాఠశాలలను టూ స్టార్‌కు అప్‌గ్రేడ్ చేయాలని ఆదేశించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, స్కిల్ డెవలప్‌మెంట్ శాఖలపై ఉండవల్లిలోని తన నివాసంలో సోమవారం సమీక్ష నిర్వహించారు. ఇన్‌ఫ్రాకు సంబంధించి ఈ విద్యా సంవత్సరంలో జీరో-స్టార్ పాఠశాలలన్నింటినీ వన్-స్టార్‌కు చేరేలా అభివృద్ధి చేయాలన్నారు. 2029 నాటికి రాష్ట్రంలోని అన్ని పాఠశాలలనూ 4-స్టార్‌కు చేర్చేలా ప్రణాళికలు రూపొందించాలని, కనీసం వెయ్యి పాఠశాలలను 5-స్టార్‌కు చేర్చాలని తెలిపారు. ఏజెన్సీలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలపై ప్రత్యేకంగా శ్రద్ధ వహించాలన్నారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. వన్-స్టార్ 1,685, టూ-స్టార్ 15,618, త్రీ-స్టార్‌లో 19,099, ఫోర్-స్టార్‌లో 7,172 పాఠశాలలు ఉన్నాయని పాఠశాల మౌలిక సదుపాయాలశాఖ కమిషనర్ రంజిత్ బాషా తెలిపారు. ఏడు వేల హైస్కూళ్లలో పూర్తిస్థాయిలో కంప్యూటర్ ల్యాబ్స్, అటల్ టింకరింగ్ ల్యాబ్స్ ఏర్పాటుపై అధికారులు దృష్టి సారించాలని మంత్రి లోకేష్ సూచించారు.
స్కిల్ డెవలప్‌మెంట్‌కు ప్రాధాన్యత
కేంద్ర ప్రభుత్వ స్కిల్ డెవలప్‌మెంట్ విభాగం ఆధీనంలోని ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన పథకం ద్వారా రాష్ట్రంలో ఏడాదికి 5 లక్షల మంది విద్యార్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వాలన్న లక్ష్యానికి అనుగుణంగా చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి లోకేష్ ఆదేశించారు. ఈ సమావేశంలో మానవ వనరులశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు, విద్య, మౌలిక సదుపాయాల సంస్థ ఎమ్‌డి దీవెన్ రెడ్డి, స్కిల్ డెవలప్‌మెంట్ సిఇఒ నారాయణస్వామి పాల్గొన్నారు.
లోకేష్‌ను కలిసిన ఆర్చర్ జ్యోతి సురేఖ
జపాన్‌లో జరిగిన ఆసియా గేమ్స్-2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి ఆర్చరీ కాంపౌండ్ మహిళల టీమ్ విభాగంలో స్వర్ణ పతకం సాధించిన ప్రఖ్యాత ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ తన తండ్రి సురేంద్రకుమార్‌తో కలిసి మంత్రి లోకేష్‌ను కలిశారు. ఈ సందర్భంగా జ్యోతి సురేఖను లోకేష్ అభినందించారు.








కామెంట్‌లు (0)