- నిందితులకు కఠిన శిక్షలు తప్పవు సిఎం చంద్రబాబు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మద్యం మత్తులో యువకుల నిర్లక్ష్య డ్రైవింగ్‌కు బలైన వైద్య విద్యార్థిని ప్రియాంక మృతి పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి, ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్ ఉన్న యువ వైద్యురాలు ప్రాణాలు కోల్పోవడం తనను తీవ్రంగా కలిచివేసిందని ఎక్స్ వేదికగా ఆదివారం పేర్కొన్నారు. ప్రియాంక మృతికి కారణమైన నిందితులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టబోమని, కఠిన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్టప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటికే పోలీసు ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు. నిందితులపై కఠినమైన సెక్షన్లు నమోదు చేసి, వారికి శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ఘటనకు కారణమైన యువకులను ఇప్పటికే అరెస్ట్ చేసి జైలుకు పంపినట్లు ఆయన గుర్తుచేశారు. ప్రియాంక కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన చంద్రబాబు, ఆ కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు.








కామెంట్‌లు (0)