మంగళవారం, 08 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionసమస్యలు పరిష్కరించాలి :ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌

58 నిమిషాల క్రితం

muncipal
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 09, 2026, 12:04 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ వెలువడేలోపు మున్సిపల్‌ కార్మికులకు రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌ అమలుకు జిఓ జారీ చేయాలని ఎపి మున్సిపల్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ (సిఐటియు) ప్రధాన కార్యదర్శి కె ఉమామహేశ్వరరావు కోరారు. ఈ మేరకు రాయపూడిలో సిఅండ్‌డిఎంఎ పి సంపత్‌కుమార్‌కు మంగళవారం వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మున్సిపల్‌ పారిశుధ్య, ఇంజినీరింగ్‌ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీల్లో సుమారు 55 వేల మంది ఉద్యోగులు, కార్మికులు ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం పనిచేస్తున్నారని తెలిపారు. 2023 జూన్‌ 30తో వేతన ఒప్పందం ముగిసినా వేతనాలు పెంచలేదన్నారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో ప్రస్తుత జీతాలు కుటుంబ పోషణకు సరిపోవడం లేదని పేర్కొన్నారు. శ్రీకాకుళంలో తొలగించిన మేస్త్రీలు, నర్సరావుపేటలో తొలగించిన మహిళా కార్మికురాలిని విధుల్లోకి తీసుకోవాలని కోరారు. ఉద్యోగ విరమణ, మృతి, అనారోగ్యానికి గురైన కార్మికుల స్థానంలో వారి పిల్లలకు ఉద్యోగాలివ్వాలన్నారు. రూ.24 వేల వేతనం పొందుతున్న వారికి హెల్త్‌కార్డులు, 62 ఏళ్లకు ఉద్యోగ విరమణ వయోపరిమితి, గ్రాట్యూటీ సౌకర్యం కల్పించాలని డిమాండ్‌ చేశారు. మహిళా కార్మికుల రక్షణకు ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేసి, అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలివ్వాలని కోరారు. రిటైర్మెంట్‌ బెనిఫిట్స్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ఇప్పటికే ప్రభుత్వానికి పంపినట్లు సిఅండ్‌డిఎంఎ చెప్పారని ఉమామహేశ్వరరావు తెలిపారు. ఆర్థికశాఖ ఆమోదం వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పారన్నారు. మిగిలిన సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామని, మంత్రి, ఉన్నతాధికారులతో చర్చించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర నాయకులు బి లక్ష్మణరావు, మున్సిపల్‌ శ్రామిక మహిళా రాష్ట్ర కన్వీనర్‌ జె విజయలక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్