ఎపిఇడిబితో మెఘా ఒప్పందాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో: మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఇఐఎల్), దాని జాయింట్ వెంచర్ సంస్థ ఎఫ్ఎబిఆర్ఐ క్యూ ప్రైవేట్ లిమిటెడ్ రాష్ట్రంలో రూ.43,700 కోట్ల పెట్టుబడులతో వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఎపిఇడిబి)తో నాలుగు అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటి ద్వారా మొత్తం 22,940 మందికి ప్రత్యక్షంగా, 83,350 మందికి పరోక్షంగా.. మొత్తంగా 1,06,290 మందికి ఉపాధి అవకాశాలు కలగనున్నట్లు అంచనా వేశాయి. విశాఖపట్నంలో జరుగుతున్న 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు వేదికగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఎంఈఐఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పివి కృష్ణారెడ్డి సమక్షంలో ఈ ఒప్పందాలు గురువారం జరిగాయి. మచిలీపట్నం పోర్టు వద్ద భారీ పారిశ్రామిక యూనిట్ల ఏర్పాటు, పునరుత్పాదక విద్యుత్ ఉత్పత్తి, నిరంతర గ్రీన్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ నెట్‌వర్క్‌తో పాటు అత్యాధునిక ఫిజికల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ, రోబోటిక్స్ రంగాల్లో ఈ ప్రాజెక్టులు చేపట్టనున్నారు. ఈ ఒప్పందాలపై ఎంఇఐఎల్, ఎఫ్ఎబిఆర్ఐ క్యూ తరపున దొరయ్య( ఎంఇఐఎల్ డైరెక్టర్ ),పివి మానస్ రెడ్డి(జనరల్ మేనేజర్ ), శ్రీధర్ గద్దె (సిఇఓ , సోలార్ విభాగం ), శ్రీనివాస్ రెడ్డి సుంకర (ఎఫ్ఎబిఆర్ ఐ క్యూ, సిఇఓ) సంతకాలు చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , మంత్రి నారా లోకేష్ సమక్షంలో ఎపిఇడిబి అధికారులతో కలిసి ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.







కామెంట్‌లు (0)