- మంత్రి సవిత
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఏళ్ల తరబడి పదోన్నతుల కోసం పరితపిస్తున్న బిసి వసతి గృహాల్లో పని చేస్తున్న 300 మందికిపైగా గ్రేడ్ 2 వార్డెన్లకు సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ... ఉద్యోగోన్నతులకు అవకాశం కల్పించిందని మంత్రి ఎస్.సవిత తెలిపారు. సర్వీసు రూల్స్ లేకపోవడంతో, గ్రేడ్ 1 వార్డెన్ గా ఉద్యోగోన్నతి పొందే అవకాశం లేకుండా పోయిందని, దీంతో 2008 నుంచి సర్వీస్ రూల్స్ రూపొందించాలని, ఉద్యోగోన్నతులు కల్పించాలని ఎన్నో పర్యాయాలు ఆయా ప్రభుత్వాల దృష్టికి తీసుకొస్తున్నారని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ విషయమై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తను తీసుకువెళ్లినట్లు తెలిపారు. ఉద్యోగోన్నతుల కోసం గ్రేడ్ 2 వార్డెన్ల సమస్యలు వివరించినట్లు చెప్పారు. దీంతో గ్రేడ్ 2 హాస్టల్ వార్డెన్లకు ఉద్యోగోన్నతులు కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, దీనిలో భాగంగా సర్వీస్ రూల్స్ రూపొందిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసినట్లు తెలిపారు. దీనివల్ల భవిష్యత్తులో గ్రేడ్ 1 వార్డెన్లగా వారికి ఉద్యోగోన్నతులు కల్పించడానికి అవకాశం కలుగుతుందన్నారు. ఉద్యోగంలో చేరిన నాటి నుంచి సీనియార్టీని పరిగణలోకి తీసుకుని ఉద్యోగోన్నతులు కల్పించనున్నట్లు చెప్పారు.








కామెంట్‌లు (0)