- మంత్రి కొలుసు పార్థసారథి
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని గృహనిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, 2014-19 మధ్య 13.04 లక్షల ఇళ్లు మంజూరు చేసి, రూ.10,194 కోట్లు ఖర్చు చేసి 8.04 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించిన ఘనత చంద్రబాబు ప్రభుత్వానిదేనన్నారు. ఆర్థికంగా వెనుకబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీ లబ్ధిదారులకు అదనపు ఆర్థిక సాయంగా రూ.712.83 కోట్లు అందించామని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 18.61 లక్షల ఇళ్లు మంజూరైనా, రూ.9,588 కోట్లు ఖర్చు చేసి కేవలం 6.70 లక్షల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయని విమర్శించారు. అలాగే గతంలో మంజూరైన 4.36 లక్షల ఇళ్లను రద్దు చేసి పేదలకు అన్యాయం చేశారని ఆరోపించారు. గతంలో పంపిణీ చేసిన 20.29 లక్షల ఇంటి స్థలాల్లో ఇప్పటికీ 12.39 లక్షల స్థలాల్లో ఇళ్లు మంజూరు చేయాల్సి ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గృహ నిర్మాణ పనులు వేగం పుంజుకున్నాయని తెలిపారు. పిఎం ఆవాస్ యోజన అర్బన్, గ్రామీణ్, పీఎం-జనమన్ పథకాల కింద మొత్తం 86,714 ఇళ్లు మంజూరయ్యాయని చెప్పారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇప్పటి వరకు రూ.2,102 కోట్లు ఖర్చు చేసి 4.56 లక్షల ఇళ్లను పూర్తి చేసినట్లు వెల్లడించారు. పక్కా గృహాల కోసం వచ్చిన 10.42 లక్షల దరఖాస్తుల్లో పరిశీలన అనంతరం 9.50 లక్షల మంది అర్హులను గుర్తించామని, తొలి విడతగా కేంద్రం 74,812 ఇళ్లను మంజూరు చేసిందన్నారు. భవిష్యత్తులో అవసరానికి అనుగుణంగా మరిన్ని ఇళ్లను కేంద్రం నుంచి మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.
పిఎంఎవై అర్బన్ 2.0లో ఒక్కో ఇంటికి రూ.2.50 లక్షల యూనిట్ వ్యయం నిర్ణయించగా, అందులో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష అందిస్తుందని తెలిపారు. పిఎంఎవై గ్రామీణ్ పథకంలో ఒక్కో ఇంటికి రూ.2.39 లక్షల వ్యయం ఉండగా, కేంద్రం రూ.72 వేలు, రాష్ట్రం రూ.48 వేలు, అదనంగా రూ.80 వేల వడ్డీలేని రుణం, ఉపాధి హామీ పథకం కింద రూ.39 వేలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.








కామెంట్‌లు (0)