పర్యావరణ వేత్త రాజేంద్ర సింగ్
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం): సింహాచలం భూములను, విశాఖపట్నం కొండలను, జలాశయాలను పరిరక్షించాలని, ప్రకృతికి కోలుకోలేని నష్టం జరగకుండా ఇప్పుడే మేల్కొనాలని ప్రముఖ పర్యావరణవేత్త, భారత జలపురుషుడుగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ రాజేంద్ర సింగ్ కోరారు. డేటా సెంటర్ ప్రాజెక్టు కారణంగా విశాఖపట్నంలోని సున్నితమైన పర్యావరణ వ్యవస్థలకు, జలవనరులకు, భూములకు నష్టం కలుగుతుందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో ఆయన జల్ బిరాదరి జాతీయ కన్వీనర్, పర్యావరణ కార్యకర్త బొలిశెట్టి సత్యనారాయణతో కలిసి పర్యటించారు. అనంతరం సింహాచలంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... అభివృద్ధి పేరుతో ప్రకృతిని ధ్వంసం చేసే పరిస్థితి ఎప్పటికీ రాకూడదని, వాటిని పునరుద్ధరించడం అసాధ్యం అని, ఆ పరిస్థితి రాకముందే ప్రభుత్వం తన బాధ్యతను గుర్తించాలని కోరారు. ముడసర్లోవ జలాశయ పరిరక్షణ కోసం గతంలో ప్రభుత్వంతో చర్చించి నీటి నిల్వలు మెరుగుపడేలా కృషి చేశామని తెలిపారు. ఈ జలాశయాలను కాపాడేందుకు విశాఖపట్నం ప్రజలంతా ఐక్యంగా ముందుకు రావాలని, భారీ పారిశ్రామిక, సాంకేతిక ప్రాజెక్టుల కారణంగా ఈ అమూల్యమైన జలవనరులపై అదనపు ఒత్తిడి పడకుండా చూడాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణ కోసం, హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు సక్రమంగా అమలయ్యేలా చూడాలని కోరారు. అధికారులు చట్టబద్ధమైన బాధ్యతలను నిర్వర్తించాలని, వర్తించే పర్యావరణ చట్టాలను కచ్చితంగా అమలు చేయాలని, చట్టవిరుద్ధమైన పర్యావరణ నష్టానికి దారితీసే కార్యకలాపాలను అడ్డుకోవాలని కోరారు.








కామెంట్లు (0)