గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

రిజిస్ట్రేషన్ పట్టాలకై "నిరసన దీక్ష"

1 గంట క్రితం

nellore
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 12:07 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-నెల్లూరు: పేదలకు ప్రభుత్వం యిచ్చిన ఇళ్ల పట్టాలను వెంటనే రిజిస్ట్రేషన్ పట్టాలుగా మార్పు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ డిమాండ్ చేశారు. గురువారం కలెక్టర్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో "నిరసన దీక్ష" చేపట్టారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ మాట్లాడుతూ నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ సిటీ, రూరల్ నియోజకవర్గాల పరిధిలో నివశిస్తున్న పేదలకు దాదాపు 50 వేలకు పైగా ఇళ్ల నివేశన స్థల పొజిషన్ సర్టిఫికేట్లు, అసైన్డ్ పట్టాలు, ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం యిచ్చింది. ఇవి హౌసింగ్ కార్పొరేషన్ రుణాలు పొందేందుకు, కరెంటు మీటర్ కనెక్షన్లు తీసుకునేందుకుతప్ప మరెందుకూ ఉపయోగపడటం లేదన్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో సంవత్సరాల తరబడి ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఉంటున్నా పట్టాలు ఇవ్వలేదని, ఫలితంగా ఈ ప్రాంతాల్లోని ప్రజలందరూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. వివిధ పథకాల ద్వారా పేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని ప్రభుత్వాలు చెపుతున్నా ఇంకా అనేక మంది స్వంత ఇల్లు గాని ఇంటి స్థలం గాని లేక బాడుగ ఇళ్లల్లో వుంటూ బాధలు పడుతున్నారన్నారు. చెరువు, కాలువ, ఏటి పోరంబోకు భూముల్లో నివాసాలుంటున్న వారికి, ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్న వారికి, స్వంత ఇల్లు గాని, స్థలంగాని లేని అర్హులందరికీ ఇళ్ల స్థలాలు యివ్వాలని డిమాండ్ చేశారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాదాల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నెల్లూరు సిటి, రూరల్ ప్రాంతాలలో పేద, మధ్య తరగతి నివసించే ఎక్కువ ప్రాంతాలను ప్రభుత్వ నిషేధిత భూములు (22ఎ) జాబితాలోకి చేర్చారన్నారు. దీనివల్ల గతంలో రిజిస్ట్రేషన్ అవుతున్న ఇళ్ళకు కూడా రిజిస్ట్రేషన్లు కాకుండా నిలిచిపోయాయన్నారు. ప్రజలు కష్టపడి కట్టుకున్న ఇళ్ళకు విలువ తగ్గిపోయిందని, 22ఎ జాబితా నుండి పేద, మధ్య తరగతి ప్రజలు నివసించే ప్రాంతాలు తొలగిస్తే అన్నీ ఇళ్ళకు రిజిస్ట్రేషన్ సౌకర్యం వర్తిస్తుందని తెలిపారు. ఇళ్ళకు విలువ పెరుగుతుంది. దీనికోసం సిపిఎం గడచిన సంవత్సరాలలో వివిధ రూపాలలో అనేక ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించినా ప్రభుత్వం నుండి ఏరకమైనా స్పందన కనిపించకపోవడం దారుణం అన్నారు. సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎం.భాస్కరయ్య మాట్లాడుతూ “పేదలందరికీ పట్టాభిషేకం" అనే పేరుతో రాష్ట్ర ప్రభుత్వం వివిధ పట్టణాల్లో ఇటీవల పట్టాలు ఇచ్చిందని, విశాఖపట్నంలో రిజిస్ట్రేషన్ పట్టాలుగా ఇచ్చారు. కృష్ణా జిల్లాలో చెరువు పోరంబోకు భూముల్లో కూడా పట్టాలు భూమి క్లాసిఫికేషన్ మార్చేందుకు జీఓ నెం-618 జారీ చేసి విజయవాడలో ఇళ్ళ పట్టాలు యిచ్చిందన్నారు. విశాఖపట్నం, విజయవాడల్లో ఇచ్చిన విధంగా నెల్లూరులో కూడా ప్రభుత్వం యిచ్చిన పట్టాలను "కన్వేయన్స్ డీడ్" పేరుతో రిజిస్ట్రేషన్ పట్టాలుగా మార్పు చేసి యివ్వాలని డిమాండ్ చేశారు. ఈ నిరసన దీక్షలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కత్తి శ్రీనివాసులు, పి సూర్యనారాయణ, బీపీ నర్సింహులు, కొండా ప్రసాద్, ఒంగోలు సుధీర్, మహిళా నాయకురాలు రామమ్మ, కత్తి పద్మ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్