- డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా వినాయకుడి విగ్రహంతో నిరసన
- ప్రజలకు తాగునీరు లేని విశాఖలో డేటా సెంటర్‌కు అనుమతులు ఎలా ఇస్తారు?: సీపీఎం
విశాఖపట్నం: ప్రజలకు తాగునీటి కొరతతో ఇబ్బందులు ఎదురవుతున్న సమయంలో అధిక మొత్తంలో నీరు, విద్యుత్తు అవసరమయ్యే డేటా సెంటర్‌ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ సీపీఎం జగదాంబ జోన్ కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం జివిఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. డేటా సెంటర్ వల్ల నీటి వనరులపై పడే భారాన్ని తెలియజేస్తూ వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా సీపీఎం సీనియర్ నాయకులు వై. రాజు మాట్లాడుతూ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. భాద్రపద మాసం సాధారణంగా వర్షాలు కురిసే కాలమైనప్పటికీ విశాఖపట్నంలో భూగర్భ జలాలు అడుగంటిపోయి ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో గూగుల్–అదానీ డేటా సెంటర్‌కు ప్రభుత్వం అనుమతులు ఇవ్వడానికి సిద్ధపడటం అన్యాయమని విమర్శించారు. డేటా సెంటర్‌కు భారీ స్థాయిలో నీరు, విద్యుత్తు అవసరమవుతాయని, ప్రజల తాగునీటి అవసరాలకే నీరు అందించలేని పరిస్థితుల్లో పారిశ్రామిక అవసరాల కోసం ఇంతటి భారీ మొత్తంలో నీటిని కేటాయించడం సరికాదన్నారు. లక్షలాది ఉద్యోగాలు వస్తాయని ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవంగా వచ్చే ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువగా ఉండే అవకాశం ఉందని, అందులోనూ స్థానికులకు ఎన్ని ఉద్యోగాలు లభిస్తాయో స్పష్టత లేదని అన్నారు.
డేటా సెంటర్ కోసం వందల ఎకరాల అటవీ భూములు, సింహాచలం దేవస్థానం భూములు, రైతుల భూములను వినియోగించడాన్ని కూడా వై. రాజు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ ప్రాజెక్టు వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడే ప్రమాదం ఉందని, విశాఖ నగర ప్రజల ఆరోగ్యం, పచ్చదనం, నీటి వనరులపై ప్రతికూల ప్రభావాలను పరిగణనలోకి తీసుకోకుండా ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడం తగదన్నారు. ప్రజల ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న డేటా సెంటర్‌ను అనుమతించబోమని, దీనిపై విస్తృత స్థాయిలో ప్రజా ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.
0సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం.సుబ్బారావు మాట్లాడుతూ ప్రజలకు తాగునీరు అందించడానికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని, సాగునీటికి రెండో ప్రాధాన్యత, పరిశ్రమలకు మూడో ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విశాఖపట్నంలో భారీ స్థాయిలో నీటిని వినియోగించే డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడం అన్యాయమన్నారు. అటవీ భూములు, దేవస్థానం భూములు, రైతుల భూములకు సంబంధించి ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ వాటిని ఉల్లంఘించి ప్రాజెక్టు కోసం భూములను కేటాయించడం సరికాదన్నారు. డేటా సెంటర్‌కు వ్యతిరేకంగా నగరంలోని వాడవాడలా ప్రచారం నిర్వహించి ప్రజలను సమీకరించి ఉద్యమాన్ని మరింత విస్తృతం చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సీఐటీయూ నాయకులు చంద్రమౌళి, డీవైఎఫ్‌ఐ నాయకులు గణేష్, హోటల్ యూనియన్ నాయకులు ఎర్రిబాబు, ప్రకాష్, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు నర్సింగరావు, సిమ్మ నాయుడు తదితరులతో పాటు పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)