బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

రాష్ట్రంలో నిరసనాగ్రహం

20 జులై, 2026

citu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 21, 2026, 12:22 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్

- విద్యార్థి, యువజన, ప్రజాసంఘాల ఆధ్వర్యాన ఆందోళనలు

ప్రజాశక్తి - యంత్రాంగం

నీట్ ప‌రీక్ష పేప‌ర్ లీక్‌కు బాధ్య‌త వ‌హిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామ చేయాల‌ని, నేషనల్‌ ‌టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్ టిఎ) రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో నిరసన దీక్ష చేస్తున్న ప్రముఖ పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్ చుక్ ను బలవంతంగా ఆస్పత్రికి తరలించడాన్ని, ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఆందోళన చేస్తున్న వారిపై పోలీసుల దాడిని నిరసిస్తూ రాష్ర్ట వ్యాప్తంగా విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు హోరెత్తాయి. నగరంలోని ప్రధాన కూడళ్ల నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ చేపట్టారు. దారిపొడవునా కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరిని నిరసిస్తూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

విజయవాడ ఎస్ఆర్ఆర్ కళాశాల నుంచి బిఎస్ఎన్ఎల్ కార్యాలయం వరకు వందలాది మంది విద్యార్థులతో నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం లీకేజీ ప్రభుత్వంగా మారిందని ఆరోపించారు. గత పది సంవత్సరాలలో 89 సార్లు పేపర్ లీక్ లతో విద్యా వ్యవస్థను ఘోరంగా దిగజార్చారని విమర్శించారు. డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న మాట్లాడుతూ...నేటి యువత, విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు వై.రాము, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.రవి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ పశ్చియ నియోజకవర్గంలో సంతకాలను సేకరించారు.

పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో వివిధ రూపాల్లో ఆందోళనలు నిర్వహించారు. భీమవరం ప్రకాశం చౌక్ లో చేపట్టిన నిరసనలో ఎపి కౌలురైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బి.బలరాం మాట్లాడుతూ... నీట్ పరీక్షా పత్రం లీక్ కు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించి, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ టిఎ ను రద్దు చేయాలని, పరీక్షల వ్యవస్థను ప్రక్షాళన చేయాలని కోరారు. ఐలూ ఆధ్వర్యాన తణుకు బార్ అసోసియేషన్ ఎదుట ఆందోళన చేపట్టారు. ఏలూరులో ఫైర్ స్టేషన్ నుంచి ప్రదర్శనగా జిల్లా పరిషత్ మీదుగా కలెక్టరేట్ ప్రాంగణానికి చేరుకుని అక్కడే ఉపాధ్యాయులు బైఠాయించారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కంబాల చెరువు సెంటర్ నుంచి గోకవరం బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వరకూ నిరసన ప్రదర్శన నిర్వహించారు. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలోని గడియార స్తంభం సెంటర్ లో ప్రజాసంఘాలు ధర్నా నిర్వహించాయి. కాకినాడ జిల్లా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టాయి.

విజయనగరంలో యుటిఎఫ్ ఆధ్వర్యాన ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఇన్ సర్వీస్ టీటర్లు టెట్ పరీక్ష అర్హత పొందాలని ఆదేశించడం అన్యాయమన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు, సీతానగరంలో నిరసన తెలిపారు. తిరుపతి బాలాజీ కాలనీ సర్కిల్లో ర్యాలీ నిర్వహించారు. చిత్తూరులో గాంధీ విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. కడపలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపట్టారు. గుంటూరులో ఎన్‌‌టిఆర్ స్టేడియం నుంచి పట్టాభిపురంలోని స్వామి వివేకానంద విగ్రహం వరకూ నిరసన ర్యాలీ నిర్వహించారు. నెల్లూరు గాంధీ బొమ్మ సెంటర్ లో నిరసన ప్రదర్శన జరిగింది. కర్నూలులో జిల్లా పరిషత్ కార్యాలయం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ప్రదర్శన నిర్వహించారు.

అనంతపురంలో టవర్ క్లాక్ సర్కిల్ నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థులతో సంతకాలను సేకరించారు. శ్రీకాకుళంలో గాంధీ విగ్రహం, ఎచ్చెర్లలో తహశీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు. విశాఖ కలెక్టరేట్‌ ఎదుట, జగదాంబ జంక్షన్‌, అనకాపల్లి జిల్లాలో పరవాడ మండలం లంకెలపాలెం జంక్షన్‌లోనూ, అల్లూరి జిల్లా కేంద్రం పాడేరులోనూ నిరసనలు చేపట్టారు. ఒంగోలులో స్థానిక సుందరయ్య భవన్ నుంచి కర్నూలు రోడ్డుమీదుగా ఆర్ టిసి బస్టాండ్ సమీపంలోని సాగర్ హోటల్ సెంటర్‌కు చేరుకుని నిరసన కార్యక్రమం నిర్వహించారు. ​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్