- కేంద్ర మంత్రికి ఎమ్మెల్యే, ఎంపీల విజ్ఞప్తి
ప్రజాశక్తి-రాయదుర్గం: రాయదుర్గం నియోజకవర్గ పరిధిలోని కనేకల్లు, బొమ్మనహాళ్ మండలాల్లో ఎడారీకరణ నివారణకు ₹150కోట్ల ప్రత్యేక నిధులు మంజూరు చేయాలని కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ను ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు, అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ కోరారు. ఈ మేరకు ఢిల్లీలోని మంత్రి కార్యాలయంలో బుధవారం ఆయనకు వినతిపత్రం సమర్పించారు. దక్షిణ భారతదేశంలోనే ఎడారి ఛాయలు వేగంగా విస్తరిస్తున్న రాయదుర్గం ప్రాంతానికి ప్రత్యేకంగా కేంద్ర నిధులు మంజూరు చేయాలని వారు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గ పరిధిలోని మాల్యం నుంచి దర్గా హొన్నూరు వరకు దాదాపు 20 వేల ఎకరాల విస్తీర్ణంలో ఇసుకమేటలు, ఇసుక దిబ్బలు విస్తరించిన విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఎడారి క్రమంగా విస్తరిస్తుండటంతో స్థానిక ప్రజలు, రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వివరించారు. వీటి నివారణ కోసం గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 2017లో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా కొంతమేర ప్రయత్నం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేక చొరవతో ఆనాడు చర్యలు తీసుకున్నప్పటికీ, అవి పూర్తిగా ఫలప్రదం కాలేదని తెలిపారు. ఏటికేడు ఎడారీకరణ క్రమంగా విస్తరిస్తుండటం ఆందోళన కలిగిస్తోందని, శాస్త్రీయ అధ్యయనాలు కూడా ఈ విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇటీవల ఉపాధి హామీ పథకం రాష్ట్ర డైరెక్టర్ షణ్ముఖ్ నేతృత్వంలోని ఉన్నతస్థాయి బృందం రాజస్థాన్‌లోని ఎడారి ప్రాంతాల్లో పర్యటించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసిందన్నారు. రాయదుర్గం ప్రాంతంలో ఎడారీకరణ నివారణకు తీసుకోవలసిన చర్యలపై బృందం అనేక సిఫార్సులు చేసినట్లు తెలిపారు. అయితే సాధారణ నిధులు ఎడారీకరణ నివారణ చర్యల అమలుకు ఏమాత్రం సరిపోవని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. కావున రాబోయే మూడేళ్లలో ఉపాధి హామీ పథకం కింద ప్రత్యేకంగా ఎడారి నివారణ కోసం రూ.150 కోట్ల నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. తద్వారానే ఎడారి నివారణ చర్యలు చేపట్టడానికి సాధ్యపడుతుందని వివరించారు. తమ విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి చంద్రశేఖర్ సానుకూలంగా స్పందించారని, సాధ్యాసాధ్యాలను పరిశీలించి త్వరలోనే తగిన సమాచారం అందజేస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు తెలిపారు.








కామెంట్‌లు (0)