సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఆరోగ్య హక్కు చట్టం చేయాలి

6 రోజుల క్రితం

praja pav
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 03, 2026, 11:51 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

- వైద్య, ఆరోగ్య శాఖ మంత్రికి ప్రజారోగ్యవేదిక వినతి

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రతి పౌరునికి అందుబాటులో ఉండే, సమానమైన, నాణ్యమైన, సమగ్ర ఆరోగ్య సేవలను చట్టబద్ధ హక్కుగా కల్పించే ఆరోగ్య హక్కు చట్టం తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన చర్యలు చేపట్టాలని ప్రజారోగ్య వేదిక వైద్య,ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ ‌యాదవ్‌‌ను కోరింది. వేదిక ప్రధాన కార్యదర్శి టి కామేశ్వరరావు, ఆర్గనైజింగ్‌ ‌కార్యదర్శి జి విజయ్‌ ‌ప్రకాష్‌ ‌సచివాలయంలో మంత్రిని కలిసి వినతిపత్రం అందించారు. విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశం తీర్మానాలను మంత్రికి అందించారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, ప్రభుత్వ ఆరోగ్య సంస్థల్లో అమలు చేస్తున్న పబ్లిక్–ప్రైవేట్ భాగస్వామ్యం(పిపిపి) విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించాలని డిమాండ్‌ ‌చేశారు. ప్రజల పన్నుల ద్వారా నిర్మించిన ప్రభుత్వ ఆరోగ్య సంస్థలు, ప్రభుత్వ యాజమాన్యం నిర్వహణలోనే కొనసాగాలని కోరారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్య రంగానికి కేటాయించే బడ్జెట్‌ను గణనీయంగా పెంచి, ప్రభుత్వ ఆరోగ్య సేవలను బలోపేతం చేసేందుకు నిరంతర ఆర్థిక మద్దతు కల్పించాలని కోరారు. నిర్మాణంలో ఉన్న అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలను పూర్తి చేయాలని కోరారు. ప్రాథమిక స్థాయి నుంచి తృతీయ స్థాయి వరకు ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయాలని తెలిపారు. ఖాళీగా ఉన్న అన్ని ఉద్యోగాలను భర్తీ చేయాలని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉచితంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కోరారు. ప్రజారోగ్య కార్యక్రమాలను బలోపేతం చేసి, గిరిజన ప్రాంతాల కోసం ప్రత్యేక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రాష్ట్రంలో వైద్య సేవలను మెరుగుపరచడానికి, ప్రజా ఆరోగ్య వేదిక ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని మంత్రి సానుకూలంగా హామీనిచ్చారని వేదిక నాయకులు తెలిపారు.

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్