శనివారం, 08 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

నాణ్యమైన ఔషధాలే ప్రజారోగ్యానికి భరోసా

12 గంటల క్రితం

health
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 07, 2026, 10:00 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- యూఎస్ ఎఫ్‌డీఏ కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఔషధ తయారీ సంస్థల్లో జరిగే ప్రతి తనిఖీ, ప్రయోగశాల పరీక్ష, నియంత్రణ సంస్థలు తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా రోగుల ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్‌డీఏ) ఇండియా కార్యాలయం కంట్రీ డైరెక్టర్ గ్రెగరీ స్మిత్ పేర్కొన్నారు. ప్రజారోగ్య పరిరక్షణకు శాస్త్రీయ విధానాలు, అంతర్జాతీయ సహకారం, నాణ్యమైన తనిఖీ వ్యవస్థ మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్ర ఔషధ నియంత్రణ పరిపాలన ఆధ్వర్యంలో అమెరికా ఫార్మకోపియా, ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ సంయుక్తంగా విజయవాడలో శుక్రవారం నిర్వహించిన ‘నాణ్యమైన ఔషధాల భరోసా – నియంత్రణ, ప్రమాణాలు, తనిఖీల్లో శాస్త్రీయ విధానం’ అంశంపై వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ.. అమెరికా ఎఫ్‌‌డిఎ పర్యవేక్షణలో ఉన్న ఔషధ తయారీ కేంద్రాల్లో సగానికి పైగా అమెరికా వెలుపలే ఉన్నాయని, అందులో భారత్ కీలక భాగస్వామిగా నిలుస్తోందన్నారు. అమెరికాకు ఎగుమతి అయ్యే ఔషధాల తయారీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమైన పాత్ర పోషిస్తోందని, రాష్ట్రంలో యూఎస్ ఎఫ్‌‌డిఎ ఆమోదం పొందిన 119 ఔషధ తయారీ కేంద్రాలు ఉండటం ఫార్మా రంగ సామర్థ్యానికి నిదర్శనమని తెలిపారు. తనిఖీల్లో సాధారణంగా విధివిధానాల అమలులో లోపాలు, సమగ్ర విచారణ లేకపోవడం, ప్రయోగశాల నియంత్రణల్లో బలహీనతలు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి అంశాలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఔషధ నాణ్యతను కాపాడడంలో శాస్త్రీయ ప్రమాణాల అమలు అత్యంత కీలకమన్నారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి. వీరపాండియన్ వర్క్‌షాప్‌ను ప్రారంభిస్తూ.. వ్యాపార నిర్వహణను సులభతరం చేసేందుకు నిబంధనలను సరళీకరిస్తున్నప్పటికీ, మందుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో తయారయ్యే ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్నందున నియంత్రణ అధికారుల బాధ్యత మరింత పెరిగిందన్నారు. నాసిరకం మందుల విషయంలో ప్రభుత్వం ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమలు చేస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అమెరికా ఫార్మకోపియా ఇండియా సైట్ హెడ్ డాక్టర్ గిరీష్ కపూర్, ఆల్ ఇండియా డ్రగ్స్ కంట్రోల్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్, ఎపి డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ ఎం. పాండురంగ ప్రసాద్, ఇన్‌స్పెక్టర్లు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్