- పెట్టుబడి కూడా రాని పరిస్థితి
- సిపిఎం బృందానికి రైతులు మొర
- జాతీయ విపత్తుగా ప్రకటించాలి
- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె. లోకనాథం
ప్రజాశక్తి- కర్నూలు కలెక్టరేట్ (విశాఖ) : ‘గత అప్పులు తీరిపోతాయని ఎంతో ఆశతో భూమిని నమ్ముకుని సాగు చేశాం. విత్తనం వేశాక మొలకెత్తక కొంత, మొలకెత్తాక కొంత ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడి అంతా నేలపాలయింది’ అని రైతులు సిపిఎం బృందం వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఎండిపోయిన పంటలకు పరిహారం ఇప్పించి ఆదుకోవాలని కోరారు. కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలను సిపిఎం ప్రతినిధి బృందం సోమవారం పరిశీలించింది. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు కె.లోకనాథం, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ, ఎండి.అంజిబాబు, ఎండి.ఆనంద్ బాబు తదితరులు ఈ బృందంలో ఉన్నారు. గూడూరు మండలం గుడిపాడులో ఎండిపోయిన పత్తి, కొర్ర పంటలను, దేవనకొండ మండలం ఈదుల దేవరబండ గ్రామంలో ఉద్యాన పంట నిమ్మ తోటను, కప్పట్రాళ్ల గ్రామం సమీపంలో ఎండిపోయిన వేరుశనగ పంటను, తుగ్గలి మండలం రాతన చెరువును పరిశీలించారు. సిపిఎం బృందానికి రైతులు తమ సమస్యలను మొరపెట్టుకున్నారు. ‘ఈ ఏడాది వర్షాలు లేక పంటలు ఎండిపోయాయి. రాష్ట్రప్రభుత్వం మాత్రం పంటల బీమా చేసుకోవాలని చెప్పి చేతులు దులుపుకుంది’ అని రైతులు సిపిఎం బృందం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పొలాల్లో పంటలను ఎండిపోయినా ఇప్పటివరకు వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చి పంట నష్టం అంచనా వేయలేదని వాపోయారు. ఎకరాలకు రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు పెట్టుబడికి అప్పులు చేశామని, తగిన పరిహారం అందించాలని రైతులు కోరారు. కె.లోకనాథం మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి వెంటనే కరువును జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులను ఆదుకునేందుకు రాష్ట్రప్రభుత్వం కర్నూలు జిల్లాకు వెయ్యి కోట్లు ప్రకటించాలని కోరారు. నష్టపోయిన రైతులను ఆదుకోకపోతే ఆందోళన చేస్తామని లోకనాథం హెచ్చరించారు.

పంటలు ఎండాయి.. పశుగ్రాసం కొరతతో పాల దిగుబడి తగ్గింది : సిపిఎం బృందం ఎదుట రైతన్నల గోడు
‘నాకున్న 50 సెంట్ల పొలంలో రూ.పది వేలు ఖర్చు చేసి కుచ్చుల పద్ధతిలో వరి సాగు చేశాను. వర్షాలు లేక పూర్తిగా పంట ఎండిపోయింది. తిండి గింజలు ఈ ఏడాది కరువే. బతుకుపై భయమేస్తోంది’ అని అనకాపల్లి జిల్లా మునగపాక మండలం పాటిపల్లి గ్రామానికి చెందిన రైతు ఆడారి శివ సత్యనారాయణ వాపోయారు. ‘వర్షాలు లేని కారణంగా పచ్చిక బయళ్లు ఎండిపోయాయి. పశుగ్రాసం లేక పాల దిగుబడి గణనీయంగా తగ్గిపోయింది. కుటుంబ పోషణ కష్టమవుతోంది’ అని అదే ప్రాంతానికి చెందిన ఎ.వెంకట అప్పారావు తన గోడును వెళ్లబోసుకున్నారు. అనకాపల్లి జిల్లాలోని కరువు ప్రభావిత ప్రాంతాలైన ఎస్.రాయవరం, రాంబిల్లి, అచ్యుతాపురం, మునగపాక, కశింకోట, చోడవరం మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించిన సిపిఎం బృందంతో రైతులు వారి బాధలు చెప్పుకొచ్చారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బి.బలరాం నేతృత్వంలో రాష్ట్ర నాయకులు మర్రాపు సూర్యనారాయణ, వి.వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు ఎం.అప్పలరాజు, ఆర్.శంకరరావు, గనిశెట్టి సత్యనారాయణ, కర్రి అప్పారావు, జి.నాయనబాబు తదితరులు ఈ పర్యటనలో పాల్గొని రైతుల కష్టాలను ఆద్యంతం విన్నారు. తొలుత వారు ఎస్.రాయవరం మండలం గెడ్డపాలెంలో పర్యటించారు. వర్షాలు లేక పంట వేయలేదని, ప్రస్తుతం ఉపాధి పనులకు వెళుతున్నామని స్థానిక రైతులు వారికి చెప్పారు. చోడవరం మండలంలోని దుడ్డుపాలెంలో కరువు పరిస్థితులపై రైతులు మాట్లాడుతూ తమ గ్రామంలో 300 ఎకరాల ఆయకట్టు మేర పల్లపు భూమి ఉందని, కనీసం ఐదు శాతం కూడా వరి నాట్లు పడలేదని తెలిపారు. ఆయా చోట్ల సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బలరాం మాట్లాడుతూ అనకాపల్లి జిల్లాలోని 24 మండలాల్లోనూ ఈ ఏడాది అతి స్వల్ప వర్షపాతమే నమోదైందని తెలిపారు. ప్రతి ఏటా ఈ జిల్లాలో లక్షా ముప్పై వేల ఎకరాల్లో వరి పంట వేయాల్సి ఉండగా ఈ సంవత్సరం కేవలం 12,500 ఎకరాల్లో మాత్రమే వరినాట్లు వేశారన్నారు. అవి కూడా పూర్తిగా పండే అవకాశం ఉండదని తెలిపారు.
స్థానిక ఎన్నికల కోసమే పోలవరం కాలువ జిమ్మిక్కులు...
కశింకోట మండలం తాళ్లపాలెం వద్ద పోలవరం ఎడమ కాలువ - ఏలేరు కాలువ అనుసంధాన ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం బలరాం మాట్లాడుతూ స్థానిక ఎన్నికల కోసమే పోలవరం కాలువ జిమ్మిక్కులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. ఇటీవల పాయకరావుపేట వద్ద ఎడమ కాలువ ద్వారా నీరు విడుదల చేసే కార్యక్రమానికి సిఎం శ్రీకారం చుట్టినా కశింకోట వద్ద ఆ నీరు ముందుకు కదలడం లేదన్నారు. లక్షా 50 వేల ఎకరాలకు నీరు ఇవ్వడం ఈ ప్రాజెక్టు ఉద్దేశమని చెప్పినా అనకాపల్లి జిల్లాలో ఒక్క ఎకరాకు కూడా నీరు అందే పరిస్థితి ప్రస్తుతం లేదన్నారు.
కరువును వెంటనే గుర్తించాలి : రైతు పెద్దారెడ్డి, గూడూరు మండలం గుడిపాడు
‘90 ఎకరాల్లో పంటలను సాగు చేశాను. ఇందులో కంది కొర్రలు పత్తి పంటలను సాగు చేశాను. పంటల సాగుకు దాదాపుగా రూ .20 లక్షలకు పైగానే పెట్టుబడులు పెట్టాం. ఇప్పుడు పంటలు ఎండిపోయాయి’
మొక్కలు ఎండిపోతాయి : రైతు ప్రసాదు, దేవనకొండ మండలం ఈదురు దేవరబండ
‘ఎనిమిది ఎకరాల్లో నిమ్మ తోటకు సాగుకు దాదాపుగా రూ.ఐదు లక్షలకు పైగా పెట్టుబడులు పెట్టాం. నిమ్మ తోటకు తప్పనిసరిగా నీళ్ళు అందాలి. హంద్రీనీవా ద్వారా పందికోన రిజర్వాయర్ నుండి నీటిని విడుదల చేస్తే తోటను కాపాడుకుంటాం.








కామెంట్‌లు (0)