- ప్రభుత్వానికి 17 వరకు డెడ్‌లైన్
- ఉపా చట్టం రద్దు కోసం ఐక్య ఉద్యమాలు
- రౌండ్‌టేబుల్‌లో విపక్షాల నేతలు
- సనాతన ప్రచారం చేస్తున్న పవన్ పై ఉపా కేసు పెట్టాలి: సిసిఎం మధు
విజయవాడ: ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడు ప్రశ్న రావణ్‌పై మోపిన ఉపాచట్టం కేసు తక్షణమే ఉపసంహరించాలని వ్యక్తలు డిమాండ్ చేశారు. శుక్రవారం విజయవాడలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య అధ్యక్షతన రౌండ్‌టేబుల్ నిర్వహించారు. ప్రజాస్వామ్యాన్ని అంతం చేసే ప్రయత్నం జరుగుతోందని, ప్రశ్నించే, విమర్శించేవారిపైన కేసులు మోపుతూ కూటమి ప్రభుత్వం వేధింపులకు పాల్పడుతోందని, ఇటీవల కాలంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి విభాగం కలిగించేలా అనేక పరిణామాలు జరగడంపై సమావేశంలో విపక్షాల నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.ఈ నెల 17లోగా ఉపా కేసును ఉపసంహరించాలన్నారు. సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు, మాజీ ఎమ్ పి పి.మధు మాట్లాడుతూ రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని పక్కదారి పట్టించేందుకు ఉపా చట్టం కింద ప్రశ్న రావణ్‌ను జైలుకు పంపడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ప్రజల్లో పెద్ద ఎత్తున చైతన్యం తీసుకురావాలన్నారు. సనాతన ధర్మం అనేదీ.. భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఉందని, అది దేశ సమైక్యతకు విఘాతం కలిగిస్తుందని, అలాంటి సనాతన ధర్మంపై పదేపదే మాట్లాడే పవన్ కల్యాణ్‌తోపాటు సనాతన ధర్మం గురించి మాట్లాడే వారిపై ఏకోన్ముకంగా కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు దాసోహంగా ప్రధాని మోడీ మారారని, అలాంటి మోదీతో పవన్ అంటకాగుతున్నారని మండిపడ్డారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేలా కూటమి ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధ చర్యలకు పాల్పడుతోందని నేతలు ధ్వజమెత్తారు. సిపిఐ జాతీయ నాయకులు డాక్టర్ కె.నారాయణ మాట్లాడుతూ ప్రజలను డైవర్షన్ చేసేందుకు రావణ్‌పై రాజకీయ కుట్రలకు పాల్పడ్డారని, తక్షణమే ఉపా కేసు ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమస్యల్లో చిక్కుకున్నాయని చెప్పారు. రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఎబి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలోని వందమలాదిగా ఉన్న యూట్యూబర్ల వాక్ స్వాతంత్రానికి, భావజాలానికి భంగం కలిగేలా పాలకులు వ్యవహరించడం దుర్మార్గమని తప్పుపట్టారు. ప్రతి ఒక్కరికీ భావ ప్రకటనా స్వేచ్ఛ ఉండాలనేదే తమ అభిమతమని స్పష్టం చేశారు. వైసిపి సీనియర్ నేత అంబటి రాంబాబు మాట్లాడుతూ ప్రశ్న రావణ్‌పై ఉపా చట్టం కేసు నమోదు అన్యాయం, అక్రమం, దారుణమని ఖండించారు. ఈ కేసు ముగిసేవరకు వైసిపి పక్షాన ప్రశ్న రావణ్‌కు అండగా నిలుస్తామని, విపక్షాలు చేసే ఉద్యమంలో భాగస్వాములవుతామని స్పష్టం చేశారు. సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కనేని వనజ ప్రశ్న యూ ట్యూబ్ నిర్వాహకుడు రావణ్ పై పెట్టిన ఉపా చట్టాన్ని ఉపసంహరించుకోవాలని తీర్మానం చేయగా, అందరూ ఏకగ్రీవంగా ఆమోదించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఐసిఎస్ లు సునీల్ కుమార్, శ్రీనివాసులు, వామపక్ష నాయకులు జల్లి విల్సన్, ముప్పాళ్ల నాగేశ్వరరావు, పి. ప్రసాద్, బి. రామకృష్ణ ,అమర్‌నాథ్, ఖాదర్ భాషా, సామాజిక వేత్త వసుంధర, పిసిసి ఉపాధ్యక్షులు కొలనుకొండ శివాజీ ,జర్నలిస్టులు డానీ, అమరయ్య మాట్లాడారు.








కామెంట్‌లు (0)