- కేంద్ర రైల్వేశాఖ సహాయ మంత్రి బి.సోమన్న
- గుంటూరులో ఆర్‌ఒబికి శంకుస్థాపన
ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి: దేశంలో రైల్వే వ్యవస్థ మొత్తం త్వరలో నూరుశాతం విద్యుద్దీకరణతో నడిచేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రి బి.సోమన్న తెలిపారు. గుంటూరుకు సమీపంలోని రెడ్డిపాలెం - గడ్డిపాడు మధ్య ఉన్న రైల్వే గేటు వద్ద రూ.147.36 కోట్ల నిధులతో నూతనంగా నిర్మించనున్న ఆర్‌ఒబికి శనివారం ఆయన కేంద్ర మంత్రి సహాయ పెమ్మసాని చంద్రశేఖర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో తూర్పు ఎమ్మెల్యే నశీర్ అహ్మద్ అధ్యక్షతన జరిగిన సభలో మంత్రి సోమన్న మాట్లాడుతూ రైళ్లన్నీ ఆధునీకరిస్తున్నామని, నూరుశాతం విద్యుత్ సౌకర్యంతో నడిచేలా ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయని తెలిపారు. ఎపిలో రూ.68 వేల కోట్లతో 38 ప్రాజెక్టులకు అనుమతిచ్చామని, 78 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. నిడదవోలు, మంగళగిరితో పాటు ఎనిమిది రైల్వేస్టేషన్లు ఇప్పటికే పూర్తయ్యాయని, బళ్లారి - గుంతకల్ తదితర రైల్వే లైన్లు ట్రిపుల్ రైల్వే లైన్లుగా మారుస్తున్నామని, తెనాలి రైల్వేస్టేషన్‌ను అమృత్ భారత్ రైల్వేస్టేషన్‌గా మార్చే పనులు 78 శాతం పూర్తయ్యాయని తెలిపారు. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గుంటూరుకు రూ.750 కోట్లతో ఎనిమిది ఆర్‌ఒబిల నిర్మాణానికి ఇప్పటి వరకు అనుమతులు వచ్చాయన్నారు. కార్యక్రమంలో సౌత్ కోస్టల్ రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాధూర్, రాజ్యసభ సభ్యులు భాష్యం రామకృష్ణ, రైల్వే డిఆర్‌ఎం సుదీష్టసేన్, ఎమ్మెల్యేలు గళ్లా మాధవి, బి.రామాంజనేయులు, దూళిపాళ్ల నరేంద్రకుమార్, తెనాలి శ్రావణ్‌కుమార్, డిసిఎంఎస్ చైర్మన్ వడ్రాణం హరిబాబు, కార్పొరేషన్ చైర్మన్లు డేగల ప్రభాకర్, మల్లెల ఈశ్వరరావు, మన్నవ మోహన్ కృష్ణ, పిల్లి మాణిక్యరావు, జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.







కామెంట్‌లు (0)