- అమరావతిలో నిర్మాణ పనులకు ఆటంకం
- పలుచోట్ల విద్యుత్, ట్రాఫిక్ కు అంతరాయం
- విశాఖలో పిడుగుపాటుకు మూగ జీవాలు మృతి
ప్రజాశక్తి-యంత్రాంగం : బంగాళఖాతంలో ఏర్పడిన ద్రోణి అల్పపీడన ప్రభావంతో గురువారం పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ్డాయి. ఈదురు గాలులకు పలుచోట్ల చెట్లు నేల కూలాయి. విశాఖలో పిడుగు పాటుకు ఐదు ఆవులు, ఐదు గొర్రెలు, ఒక గేదె మృత్యువాత పడ్డాయి.
రాజధాని అమరావతిలో భారీ వర్షం కురిసింది. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పాడంది. గంటకు పైగా ఉరుములు, మెరుపులతో కురిసిన వర్షంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఎగువ నుంచి పల్లపు ప్రాంతాల్లోకి పెద్ద ఎత్తున వర్షం నీరు చేరింది. తుళ్లూరు - తాడికొండ ప్రధాన రహదారిలోని గుంతల్లోకి నీరు చేరి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ మార్గంలో వాగులు పొంగి రాకపోకలకు ఇబ్బంది కలుగుతుందేమోనన్న భయంతో సచివాలయం, హైకోర్టు, సిఆర్‌డిఎ ఉద్యోగులు ప్రయాణించే బస్సులను మంగళగిరి వైపుగా గుంటూరుకు మళ్లించారు. భారీ వర్షం కారణంగా రాజధాని నిర్మాణ పనులకు ఆటంకం ఏర్పడింది. ప్రధానంగా మట్టి తవ్వకం పనులకు ఇబ్బంది కలిగింది. నిర్మాణ పనుల్లో నిమగ్నమైన కార్మికులు తాత్కాలికంగా ఏర్పాటు చేసుకున్న రేకుల పాకల్లో తలదాచుకున్నారు. ఈ రైతుల రిటర్నబుల్ ప్లాట్లను జోన్ల వారీగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. రోడ్లు, విద్యుత్, తాగునీరు తదితర మౌలిక సదుపాయాలు కల్పిస్తోంది. ఇందుకు సంబంధించిన పనులు జరుగుతుండగా వర్షంతో ఆటంకం ఏర్పడింది. కొన్నిచోట్ల ప్లాట్లలోకి నీరు చేరడంతో భారీ యంత్రాలతో చేపట్టే పనులకు కొంత ఇబ్బందికర పరిస్థితి తలెత్తింది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో గురువారం పలుచోట్ల ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. విశాఖ నగరంలోని గాజువాక, కూర్మన్నపాలెం ప్రాంతాల్లో రోడ్లపైకి నీరు చేరింది. అల్లూరి జిల్లా జికె వీధి మండలం మొండిగడ్డ పంచాయతీ కొండపల్లి గ్రామంలో ఐదు ఆవులు, ఐదు గొర్రెలు పిడుగుపాటుకు మృతి చెందాయి. తమను ఆదుకోవాలని బాధిత రైతులు వంతల లక్ష్మణరావు, వంతల గోవింద, వంతల త్రినాధ్, వంతల మోహన్ కోరారు.
అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం నారపాడు గ్రామ పంచాయతీ శివారు అమ్ములపాలెంలో పిడుగుపాటుకు ఒక గేదె మృత్యువాత పడింది. దీని విలువ రూ.లక్షా యాభై వేలు ఉంటుందని బాధిత అప్పారావు తెలిపారు.
ఎన్‌టిఆర్, కృష్ణాజిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం సుమారు అరగంటపాటు ఏకధాటిగా కురిసింది. ఈ ఏడాదిలో నమోదైన అత్యధిక వర్షపాతాల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని వాతావరణ శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనావేశారు. భారీ వర్షం కారణంగా పలు చోట్ల లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరింది. అత్యంత రద్దీగా ఉండే బెంజ్ సర్కిల్, మహాత్మా గాంధీ రోడ్డు, ఏలూరు రోడ్డు, నిర్మలా కాన్వెంట్, లబ్బీపేట తదితర ప్రాంతాల్లో ప్రధాన రహదారులు పూర్తిగా జలమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతుకు పైగా నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదచారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మరో మూడు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.








కామెంట్‌లు (0)