గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై అవగాహన కల్పించండి

26 జూన్, 2026

lokesh
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 26, 2026, 06:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

​కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలి

ఆర్టీజీఎస్ సమీక్షలో మంత్రి నారా లోకేష్

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై ప్రజల్లో మరింత‌గా అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఆర్టిజిఎస్‌ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఆర్టీజీఎస్‌పై స‌చివాల‌యంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. వాట్సాప్ గవర్నెన్స్ వినియోగంపై నెలరోజుల పాటు కార్యక్రమాలు నిర్వ‌హించాల‌ని ఆదేశించారు. ప్రభుత్వ శాఖల సమాచారాన్ని క్రోడీకరించేందుకు చేపట్టిన డేటాలేక్ ప‌నుల‌న్నీ జులై నాటికి పూర్తికావాలని చెప్పారు. కుల, ఆదాయ ధృవీకరణ పత్రాల మంజూరులో అడ్డంకులు తొలగించాలని, రేషన్ కార్డుల విభజన, కుటుంబ సభ్యుల పేర్లు చేర్చడం, తొలగించే ప్రక్రియను మరింత సులభతరం చేయాలని చెప్పారు. సంజీవని కార్యక్రమాన్ని కూడా డేటా లేక్‌తో అనుసంధానించాలని ఆదేశించారు. పాఠశాలల్లో డ్రాప్ అవుట్ల‌ను డేటా లేక్ ద్వారా విశ్లేషించి త‌గ్గించ‌డానికి గ‌ల‌ మార్గాలను అన్వేషించాలని చెప్పారు. విద్యారంగంలో సమగ్ర సమాచారాన్ని ట్రాక్ చేస్తున్నామని, అన్ని శాఖల సమాచారం డేటా లేక్ ద్వారా అనుసంధానం కావాలని సూచించారు.విద్యార్థులు, అభ్య‌ర్థులకు విద్యా-క్రీడా సంస్థ‌లు ఇచ్చే స‌ర్టిఫికెట్లు, స్పోర్ట్స్ స‌ర్టిఫికెట్ల‌న్నీ ఆధార్ నెంబర్ ఆధారంగా పార‌ద‌ర్శ‌కంగా ప‌రిశీలించేలా చ‌ర్య‌లు తీసుకోవాలని సూచించారు. రియ‌ల్ టైమ్‌లో తెలిసేలా డిజి వెరిఫైని ప‌క‌డ్బందీగా తీర్చిదిద్దాల‌ని ఆదేశించారు. రాష్ట్రంపై ప్ర‌భావంతో ఎదుర‌య్యే వ‌ర్షాభావ ప‌రిస్థితుల‌ను జ‌ల‌వ‌నరుల శాఖ‌, వ్య‌వ‌సాయ శాఖ‌, ఇత‌ర శాఖ‌ల‌న్నీ కూడా స‌మ‌న్వ‌యంతో, ప్ర‌ణాళికాబ‌ద్ధంగా ప‌నిచేసి స‌మ‌ర్థ‌వంతంగా ఎదుర్కొందామ‌ని చెప్పారు. నీరు వృథాను అరిక‌ట్టి, త‌క్కువ నీటితో ఎక్కువ పంట‌లు పండించే దిశ‌గా రైతులను ప్రోత్స‌హించాల‌ని సూచించారు. జ‌లాశ‌యాల్లో నీటి ల‌భ్య‌త ఎంత ఉంది, భూగ‌ర్భజ‌ల మ‌ట్టాలు ఏ స్థాయిలో ఉన్నాయ‌నేది ఆర్టీజీఎస్‌లోని అవేర్ విభాగం ద్వారా రియ‌ల్ టైమ్‌లో ఎప్ప‌టిక‌ప్పుడు తెలుసుకుని ఆ దిశ‌గా అధికారులు కార్యాచ‌ర‌ణ చేప‌ట్టాలని ఆదేశించారు. రాయ‌లసీమ‌లో నీటి ఎద్ద‌డి లేకుండా ప‌టిష్ట‌మైన చ‌ర్య‌లు తీసుకోవాలని చెప్పిన మంత్రి యూరియా సరఫరాపైనా ఆరా తీశారు. ​వ‌ర్షాభావ ప‌రిస్థితుల నేప‌థ్యంలో జ‌ల విద్యుత్ ఉత్ప‌త్తి త‌గ్గడంతో ఎదుర‌య్యే స‌మ‌స్య‌లు అధిగ‌మించేందుకు ప్రణాళికాబ‌ద్ధంగా ప‌నిచేయాల‌ని సూచించారు. ఈ సమావేశంలో సిసిఎల్‌ఎ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మీ, పౌరసరఫరాల శాఖ క‌మిష‌న‌ర్ క‌న్న‌బాబు,ఆర్‌‌టిజిఎస్‌ ‌సిఇవో ప్ర‌ఖ‌ర్ జైన్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి మాలిక గార్గ్‌, ఆర్టీఐహెచ్ సిఇవో ధాత్రి రెడ్డి, ఫైబ‌ర్‌నెట్ ఎండి గీతాంజ‌లి శ‌ర్మ‌, ఉన్న‌త విద్యాశాఖ క‌మిష‌న‌ర్ నారాయణ భ‌ర‌త్ గుప్తా, పాఠ‌శాల విద్యా శాఖ డైరెక్ట‌ర్ త‌మీమ్ అన్సారియా, వ్య‌వ‌సాయ శాఖ డైరెక్ట‌ర్ మన్జీర్ జిలానీ పాల్గొన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్