విశాఖలో ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నేతల అరెస్ట్
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం విశాఖనగరాలో జగదాంబ జంక్షన్ నుంచి కలెక్టరేట్ వరకూ విద్యార్థి, యువజన సంఘాలు ర్యాలీ చేపట్టాయి. ఈ ర్యాలీ మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. విద్యార్థి, యువజన నాయకులపై పోలీసులు పిడుగుద్దులతో దాడి చేసి అత్యుత్సాహం ప్రదర్శించారు. ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి అజయ్, సాయితేజ, ఉపాధ్యక్షులు కౌశిక్, మౌనిక, సహాయ కార్యదర్శి నరేష్, డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు యుఎస్ఎన్ రాజు సహా 20 మందిని అక్రమంగా అరెస్టు చేసి మహారాణి పేట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులు అజయ్, రాజు మాట్లాడుతూ... ఇప్పటికే దేశంలో 13 కోట్ల ఓట్లను చోరీ చేశారని, అలాంటి జ్ఞానేష్ కుమార్ను విధుల నుంచి తొలగించకుండా బిజెపి ప్రభుత్వం అదనపు భద్రతను ఇచ్చి రక్షిస్తోందని విమర్శించారు. దీనిని ప్రశ్నిస్తూ శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతపై నిర్బంధం ప్రయోగిస్తోందని, దేశ రాజధానిలో విద్యార్థి, యువజన నాయకులపై పైశాచికంగా దాడి చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఏ రకంగా పోలీసులు దాడి చేశారో విశాఖపట్నంలో కూడా అదే తరహాలో విద్యార్థి, యువజన నాయకులపై నిర్బంధం ప్రయోగించి అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని తెలిపారు. ఇప్పటికైనా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కడం మానేసి ఓట్లు చోరీ చేసిన జ్ఞానేష్ కుమార్ను తక్షణమే తొలగించాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాలు దేశవ్యాప్తంగా మరింత తీవ్ర స్థాయికి చేరుకుంటాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు సంజయ్, ప్రగతి, భారతి, హృదయ, తులసి, డివైఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు శ్రావణ్, ప్రభు తదితరులు పాల్గొన్నారు. అరెస్టు చేసిన వారిని పోలీసులు మధ్యాహ్నం విడిచిపెట్టారు.








కామెంట్లు (0)