- వ్యాపారులకు బోర్డు హెచ్చరిక
ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి : వ్యాపారులు ఇచ్చిన నిర్దేశిత ఇండెంట్‌ల ప్రకారం పొగాకు కొనుగోలు చేయకపోతే రిజిస్ర్టేషన్ రద్దు చేస్తామని పొగాకు బోర్డు హెచ్చరించింది. రాష్ర్టంలో పొగాకు కొనుగోళ్లను మెరుగుపరచాలని, కిలోకు రూ.200 కంటే ఎక్కువ ధర లభించే విధంగా అన్ని సంస్థలు చొరవ తీసుకోవాలని వ్యాపార సంస్థలకు పొగాకు బోర్డు విజ్ఙప్తి చేసింది. 2025-26 సంవత్సరంలో వర్జీనియా పొగాకు పంటకు సంబంధించి ప్రస్తుతం కొనసాగుతున్న ఇ-వేలం పురోగతి, కొనుగోళ్ల పరిస్థితి, రైతులకు గిట్టుబాటు ధరలు లభించే అంశాలపై గుంటూరులోని పొగాకు బోర్డు ప్రధాన కార్యాలయంలో శుక్రవారం సమీక్ష చేశారు. ఈ సమావేశానికి పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విశ్వశ్రీ, డైరెక్టర్ (ఆక్షన్స్) బి.సి. శ్రీనివాస్, ప్రధాన సిగరెట్ తయారీ సంస్థలు, ఎగుమతిదారులు, ఇతర పొగాకు వ్యాపార సంస్థల ప్రతినిధులు, ఇండియన్ టుబాకో అసోసియేషన్ ప్రతినిధులు హాజరయ్యారు. సమావేశంలో ప్రస్తుత వేలం జరుగుతున్న తీరు, తిరస్కరణల శాతం, వారాంత కొనుగోలు లక్ష్యాల అమలు తదితర అంశాలపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. గత నాలుగు నెలల్లో ఆశించిన స్థాయిలో వేలం పురోగతి లేకపోవడం, కొనుగోళ్లు మందగమనం, వచ్చిన సరుకును తిరస్కరించడం సరికాదని బోర్డు సూచించింది. పొగాకు బోర్డుకు కొనుగోలు ఇన్‌డెంట్లు సమర్పించి, వేలంలో పాల్గొనడానికి అనుమతి పొందిన ప్రతి సంస్థ తప్పనిసరిగా పొగాకు కొనాల్సిందేనని బోర్డు స్పష్టం చేసింది. వివిధ కారణాలతో వేలానికి దూరంగా ఉండరాదని స్పష్టం చేసింది. ఇన్‌డెంట్ సమర్పించి, వేలంలో పాల్గొనని సంస్థల రిజిస్ట్రేషన్‌ను రద్దు చేస్తామని హెచ్చరించింది. వ్యాపార సంస్థలు తమకు కేటాయించిన వారాంత కొనుగోలు లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తిచేసేలా కొనుగోళ్లను వేగవంతం చేయాలని, వేలానికి వచ్చిన అన్ని గ్రేడ్ల పొగాకును కొనుగోలు చేయాలని ఆదేశించింది.








కామెంట్‌లు (0)