గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవిఆర్‌ఎల సమస్యలు పరిష్కరించాలని రిలే దీక్ష

55 నిమిషాల క్రితం

vra
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 11:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ (గుంటూరు జిల్లా) : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ విఆర్‌ఎలు గురువారం రిలే దీక్ష చేపట్టారు. పే స్కేలు, జీతాలు అమలు చేయాలని, విఆర్ఒ, రికార్డు అసిస్టెంట్, అటెండర్, నైట్ వాచ్‌‌మెన్ పోస్టులను వన్‌‌లైన్‌ సెటిల్ మెంట్ ద్వారా భర్తీ చేయాలని, నామినీలను విఆర్ఎలుగా గుర్తించాలని, అక్రమ డ్యూటీలను రద్దు చేయాలని, రానున్న ఎన్నికల్లో విఆర్ఎలపై అదనపు భారాలు వేస్తే సహించేది లేదని స్పష్టం చేశారు. మంగళగిరి రూరల్ మండలం చినకాకాని నేతన్న సర్కిల్ వద్ద విఆర్ఎలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలను ఎపి విఆర్ఎల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బందగీ సాహెబ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఉమామహేశ్వరరావు ప్రారంభించి మాట్లాడారు. విఆర్ఎల సమస్యలు తక్షణం పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విఆర్ఎలకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని, నెలకు రూ.15 వేలు వేతనం పెంచుతామని హామీ ఇచ్చినా అమలు కాలేదన్నారు. ముఖ్యమంత్రిని రెండుసార్లు, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను పలుమార్లు కలిసి విఆర్ఎల సమస్యలను వివరించినప్పటికీ ఇప్పటివరకు పరిష్కారం లభించలేదన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ త్రినాధరావు, రాష్ట్ర కోశాధికారి రవికుమార్, విజయనగరం జిల్లా అధ్యక్షుడు గురుమూర్తి, పాడేరు జిల్లా అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ప్రకాశం జిల్లా అధ్యక్షురాలు జ్యోతి, పోలవరం జిల్లా నాయకుడు రవి, కర్నూలు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ రాజు, ప్రధాన కార్యదర్శి అయ్యాస్వామి, పల్నాడు జిల్లా అధ్యక్షుడు రవి, మునాఫ్, ఆనంద్‌కుమార్ తదితర విఆర్ఎలు పాల్గొన్నారు. సిఐటియు మంగళగిరి డివిజన్ కార్యదర్శి బాలాజీ మద్దతు తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్