నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు
ప్రజాశక్తి - పార్వతీపురం టౌన్ (విజయనగరం) కృష్ణా కలెక్టరేట్ : నేపాల్ వరదల్లో గల్లంతైన వారి ఆచూకీ కోసం కుటుంబీకులు ఎదురుచూస్తున్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రం పార్వతీపురం పట్టణానికి చెందిన ఓ ప్రవాసాంధ్ర కుటుంబం గల్లంతయ్యింది. పట్టణంలోని పండా వీధికి చెందిన సుభాష్ చంద్ర సాహూకు ముగ్గురు కుమారులు. వారిలో పెద్దకుమారుడు సంతోష్ కుమార్ సాహూ (47), ఆయన భార్య సురభి (43), కుమారుడు స్పందన్ (18), కుమార్తె సైనా సాహు (13)తో కలిసి 20 ఏళ్లగా లండన్‌లో స్థిరపడ్డారు. ఇటీవల వారు లండన్ నుంచి నేపాల్ మీదుగా మానస సరోవర్ యాత్రకు వెళ్లారు. ఓ వంతెనపై ప్రయాణిస్తుండగా వరద ప్రవాహం ఒక్కసారిగా ముంచెత్తడంతో వారి వాహనం గల్లంతయినట్లు తెలిసింది. దీంతో వారి ఆచూకీ లభ్యం కాలేదు. నేపాల్ గైడ్ ద్వారా ఈ విషయం సంతోష్ బంధువులకు సమాచారం వచ్చింది. సంతోష్ కుమార్ సాహూ తల్లిదండ్రులు ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో రెండో కుమారుడు మురళీ సాహూ వద్ద ఉంటున్నారు. యాత్రకు వెళ్లిన తమ కుటుంబీకులు ప్రకృతి విపత్తులో చిక్కుకోవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. గల్లంతయిన సంతోష్ కుమార్ సాహు తండ్రి సుభాష్ చంద్ర సాహూ రిటైర్డ్ ఫారెస్ట్ అధికారిగా పనిచేశారు. ఆయనకు ముగ్గురు కుమారులు. విషయం తెలుసుకున్న కుటుంబీకులంతా కన్నీరుమున్నీరయ్యారు.
కృష్ణాజిల్లా వాసి ఆచూకీ కోసం చర్యలు : కలెక్టర్
మానస సరోవర్ – కైలాస యాత్రకు వెళ్లిన కృష్ణా జిల్లాకు చెందిన చొప్పవరపు రమేష్ అక్కడ చిక్కుకున్నట్లు, ఆయన ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. కలెక్టరేట్‌లోని డిఆర్‌ఒ చాంబర్ నుంచి మీడియాతో కలెక్టర్ మాట్లాడారు. భారత రాయబార కార్యాలయంతో, నేపాల్ అధికారులతోనూ సమన్వయం చేసుకుంటున్నట్లు తెలిపారు.








కామెంట్‌లు (0)