మంగళవారం, 25 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఉద్యోగ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంపు

9 గంటల క్రితం

ap govt
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 10:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపి గిరిజన సంక్షేమ గురుకుల విద్యాసంస్థల్లో పనిచేస్తున్న రెగ్యులర్ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి ఎంఎం నాయక్‌ సోమవారం జారీ చేసింది. ఈ ఏడాది జూలై నుంచి పదవీ విరమణ చేయాల్సిన గురుకులంలోని అర్హత కలిగిన బోధన, బోధనేతర సిబ్బందిని 62 ఏళ్ల వయసు వరకు కొనసాగించేందుకు ప్రభుత్వం అనుమతించిందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ నిర్ణయం ఈ ఏడాది జూలై 2న ఆర్థిక శాఖ జారీ చేసిన జీఓ ఎంఎస్ నంబర్ 45లోని నిబంధనలకు లోబడి అమలు కానుందని స్పష్టం చేశారు. అయితే, ఉద్యోగి ఉద్యోగ విరమణ తేదీ నుంచి తిరిగి విధుల్లోకి తీసుకునే తేదీ మధ్య కాలాన్ని ‘ఉద్యోగంలో లేని కాలం’గా పరిగణిస్తారని, ఆ కాలానికి జీతం బకాయిలు చెల్లించరని, వార్షిక ఇంక్రిమెంట్లు, సీనియారిటీ, పదోన్నతులు, ఇతర సర్వీసు ప్రయోజనాలు కూడా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే ఉంటాయని తెలిపారు. ఇప్పటికే పెన్షన్, కమ్యూటెడ్ పెన్షన్, రిటైర్మెంట్ గ్రాట్యుటీ, ఆర్జిత సెలవుల నగదీకరణ వంటి ప్రయోజనాలు పొందిన ఉద్యోగుల విషయంలోనూ సంబంధిత మొత్తాలను ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం సర్దుబాటు చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఉద్యోగుల కొనసాగింపునకు ప్రస్తుత బడ్జెట్‌లోని సంబంధిత పద్దుల నుంచి ఖర్చు చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బడ్జెట్ కేటాయింపులు సరిపోని పక్షంలో 28 మంది బోధనా ఉద్యోగులకు అదనంగా రూ.4,12,15,265 అవసరమవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఈ అదనపు నిధుల కోసం ఈ ఏడాది నాలుగో త్రైమాసికంలో ఆర్థిక శాఖను సంప్రదించాలని ఆదేశించింది. అదనంగా కొత్త మంజూరైన పోస్టులు సృష్టించరాదని, ప్రభుత్వ అనుమతి లేకుండా కొత్త ఆర్థిక భారం కల్పించరాదని కూడా స్పష్టం చేసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్