ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, పరిశ్రమలు, ఉపాధి, పెట్టుబడుల కేంద్రంగా తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం గనుల రంగంలో సమగ్ర సంస్కరణలను అమలు చేస్తోందని గనులు, ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థాగత అవినీతి, అక్రమ మైనింగ్, ఇసుక దోపిడీ, కొందరి చేతుల్లో ఖనిజ సంపద కేంద్రీకరణ కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న గనుల రంగాన్ని పునరుద్ధరించి, రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంతో పాటు పారదర్శకతను నెలకొల్పామని ఆయన పేర్కొన్నారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో గురువారం నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వ విధానాలతో రాష్ట్రానికి రూ.19,137 కోట్ల ఆదాయ నష్టం వాటిల్లినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మైనర్ మినరల్ పాలసీ - 20205 పెట్టుబడులకు ప్రోత్సాహం, ప్రభుత్వానికి అధిక ఆదాయం లభిస్తుందన్నారు. ఈ పాలసీ కింద కొత్త మైనింగ్ లీజుల కాలపరిమితిని 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలకు, లీజుల పునరుద్ధరణ కాలాన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాలకు పెంచడం జరిగిందన్నారు. ఈ సంస్కరణల ఫలితంగా గత రెండేళ్లలో 1,700కు పైగా దరఖాస్తులు అందగా, 172 కొత్త మైనింగ్ లీజులు మంజూరయ్యాయన్నారు. లీజుల మంజూరు ద్వారా రాష్ట్ర ఖజానాకు రూ.172 కోట్ల ఆదాయం సమకూరగా, గత ప్రభుత్వ కాలంతో పోల్చితే గనుల రంగంలో 262 శాతం వృద్ధి నమోదైందని వెల్లడించారు. ఈ విధాన మార్పులు గనుల రంగంపై పెట్టుబడిదారుల విశ్వాసాన్ని పెంచి, రాష్ట్ర ఖనిజ వనరుల సమర్థ వినియోగానికి బాటలు వేసాయని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ గనులు, ఖనిజాల చట్టం నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఖనిజ బ్లాకుల వేలంపాటలను వేగవంతం చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానం అమలు చేస్తోందని చెప్పారు. ఇప్పటివరకు 1,91,85,793 మెట్రిక్ టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయగా, రాష్ట్రవ్యాప్తంగా 412 ఇసుక రీచ్‌లు, డిస్పాచ్ కేంద్రాలు, 238 స్టాక్ యార్డులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అదనంగా వర్షాకాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 64 లక్షల మెట్రిక్ టన్నుల బఫర్ నిల్వలు సిద్ధంగా ఉంచామని చెప్పారు. తమిళనాడు తర్వాత దేశంలో అత్యధిక బీచ్ శాండ్ ఖనిజ సంపద రాష్ట్రంలోనే ఉందని తెలిపారు. రాష్ట్ర తీరప్రాంతాల్లో లభిస్తున్న ఇల్మెనైట్, రూటైల్, జిర్కాన్, గార్నెట్, టైటానియం ఖనిజాలు అంతర్జాతీయ మార్కెట్లో అత్యంత డిమాండ్ కలిగిన విలువైన ఖనిజాలుగా గుర్తింపు పొందాయని పేర్కొన్నారు. బీచ్ శాండ్ ఖనిజాల ఆధారంగా ఏర్పడే ఈ పరిశ్రమల ద్వారా సుమారు రూ.20 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాష్ట్రానికి ఆకర్షించే అవకాశం ఉందన్నారు. అనంతపురం జిల్లాలోని జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ త్వరలో వాణిజ్య ఉత్పత్తి దశలోకి ప్రవేశించనున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్టు రాష్ట్రంలో బంగారు ఖనిజాల అభివృద్ధికి నూతన దశను తెరచి, రాష్ట్ర ఖనిజ రంగంలో కీలక మైలురాయిగా నిలవనుందని పేర్కొన్నారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో 17 ఖనిజ బ్లాకుల్లో బంగారం, ఇనుప ఖనిజం, సున్నపురాయి తదితర విలువైన ఖనిజ వనరుల అన్వేషణ వేగంగా కొనసాగుతోందని వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే శాఖ 32 శాతం ఆదాయ వృద్ధిని సాధించిందని వెల్లడించారు.
గనుల రంగంలో సంస్కరణలతో ఆదాయం పెంపు
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జూన్ 18, 2026, 09:02 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం








కామెంట్‌లు (0)