- విపత్తుల నిర్వహణ సంస్థ
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరి నది వరద ఉదృతి క్రమంగా పెరుగుతుందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. తెలంగాణలోని భద్రాచలం వద్ద శుక్రవారం సాయంత్రం 7 గంటల నాటికి నది నీటి మట్టం 49.8 అడుగులు, కూనవరం వద్ద నీటిమట్టం 16.35 మీటర్లు, పోలవరం వద్ద 10.26 మీటర్లుగా నమోదైనట్లు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్‌జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజి వద్ద ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5,39,934 క్యూసెక్కులు ఉందని తెలిపారు. శుక్రవారం రాత్రికి మొదటి ప్రమాద హెచ్చరిక, శనివారం రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద ప్రవాహం చేరే అవకాశం ఉందన్నారు. ప్రభావిత తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఏలూరు, పోలవరం జిల్లాల యంత్రాంగాన్ని అప్రమత్తం చేశామని తెలిపారు. అత్యవసర సేవలకు అమలాపురం, రాజమహేంద్రవరం, చింతూరు, వి.ఆర్ పురం, జంగారెడ్డిగూడెంలో మొత్తంగా 3 ఎన్డిఆర్‌ఎఫ్, 3 ఎస్‌డిఆఫ్‌ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉంచినట్లు వెల్లడించారు. శనివారం రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలను ముందస్తుగా సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. అత్యవసర సహాయం,సమాచారం కోసం టోల్ ఫ్రీ నెంబర్లు 112, 1070, 1800 425 0101 లను సంప్రదించాలని కోరారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, కలవర్టులు, కాజ్‌వేల వద్ద ప్రమాదకర ప్రయాణాలను చెయ్యొద్దన్నారు. నదిలో స్నానికి, ఈతకు వెళ్లడం, చేపల వేట లాంటివి చేయరాదని సూచించారు.
నేడు మోస్తరు వర్షాలు
దక్షిణ గుజరాత్, ఉత్తర మధ్య మహారాష్ట్రల మీదుగా కొనసాగుతున్న వాయుగుండానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి వుందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. వీటి ఫలితంగా శనివారంనాడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడిచింది.








కామెంట్‌లు (0)