జూన్‌లో మళ్లీ ఎగసిన ద్రవ్యోల్బణం
తెలుగు రాష్ర్టాల్లోనే అధిక భారం
న్యూఢిల్లీ : దేశంలో సామాన్యుల జేబుకు అధిక ధరలు చిల్లు పెడుతున్నాయి. రిటైల్ ద్రవ్యోల్బణం మళ్లీ కోరలు చాస్తోందని ప్రభుత్వ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ ఏడాది జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ (సిపిఐ) ఆధారిత ద్రవ్యోల్బణం 4.38 శాతానికి పెరిగింది. మే నెలలో ఇది 3.93 శాతంగా ఉండగా.. జూన్ ఒక్క నెలలోనే భారీగా పెరగడం ఆందోళకరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిర్దేశించిన 4 శాతం మధ్యకాలిక లక్ష్యాన్ని దాటడం కూడా పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది. నెలవారీ ఖర్చులు ఇప్పటికే పెరిగిన కుటుంబాలపై మరింత భారం పడే అవకాశం ఉంది. అధిక ఆహార పదార్థాల ధరలు ఈ పెరుగుదలకు ప్రధాన కారణం. జూన్‌లో ఆహార ద్రవ్యో ల్బణం 5.32 శాతానికి ఎగిసింది. అల్లం ధరలు 50.41 శాతం, టమాటా ధరలు 31.92 శాతం, కిస్మిస్ ధరలు 20.52 శాతం చొప్పున పెరిగాయి. రోజువారీ వంటింటి ఖర్చుల్లో కీలకమైన ఈ వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరగడంతో మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలు మరింత ఇబ్బందుల్లోకి నెట్టబడుతున్నాయి. రెస్టారెంట్లు, వసతి సేవల ఖర్చులు కూడా పెరగడం వల్ల ఆహారం, సేవల రంగాల్లో ధరల ఒత్తిడి కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.
గ్రామీణ ప్రాంతాల్లోనూ ధరల సెగ..
గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా కనిపిస్తోంది. గ్రామీణ రిటైల్ ద్రవ్యోల్బణం 4.74 శాతంగా నమోదవగా.. పట్టణాల్లో 3.92 శాతంగా ఉంది. ఆహార ద్రవ్యోల్బణం కూడా గ్రామీణ ప్రాంతాల్లో 5.45 శాతం, పట్టణాల్లో 5.09 శాతంగా నమోదయ్యింది. ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలతో సతమతమవు తున్న గ్రామీణ కుటుంబాలకు ఈ గణాంకాలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, రవాణా ఖర్చులు, మార్కెట్ సరఫరా సమస్యలు కలిసి గ్రామీణ వినియోగదారులపై అదనపు భారం మోపుతున్నాయి.
తెలుగు రాష్ర్టాల్లో ఇలా..
రాష్ట్రాల వారీగా పరిశీలిస్తే తెలంగాణలో రిటైల్ ద్రవ్యోల్బణం అత్యధికంగా 6.36 శాతంగా నమోదయ్యింది. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరిలో 5.39 శాతం చొప్పున, తమిళనాడు (5.24 శాతం), ఒడిశా (5.15 శాతం) ఉన్నాయి. దేశ సగటుతో పోలిస్తే ఈ రాష్ట్రాల్లో ధరల పెరుగుదల మరింత ఎక్కువగా ఉండటం ఆందోళనకరం. ముఖ్యంగా తెలంగాణలో నమోదైన అధిక ద్రవ్యోల్బణం వినియోగదారులపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. నిత్యావసరాల ధరలు పెరుగుతుండగా.. ఆదాయాలు అదే స్థాయిలో పెరగకపోవడం ప్రజల కొనుగోలు శక్తిని దెబ్బతీసే ప్రమాదం ఉంది. కొన్ని వస్తువుల ధరలు తగ్గినప్పటికీ అవి పెద్ద ఉపశమనం కల్పించలేకపోయాయి. బంగాళాదుంపలు, బఠానీలు, జీలకర్ర, కార్లు, ద్విచక్ర వాహనాల ధరలు గత ఏడాదితో పోలిస్తే తగ్గాయి. ఆహార పదార్థాలు, సేవల రంగంలో పెరుగుదల ఎక్కువగా ఉండటంతో ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే ధోరణి కొనసాగితే సామాన్య ప్రజల నెలవారీ బడ్జెట్ మరింత కుదేలయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధరల పెరుగుదల నియంత్రణలోకి రాకపోతే.. రాబోయే నెలల్లో వినియోగదారులపై మరింత తీవ్రమైన భారమే పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.








కామెంట్‌లు (0)