- ప్రాజెక్టులపై ఎడిసిఎల్ అధికారులతో మంత్రి నారాయణ సమీక్ష
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాజధానిలో రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు పూర్తయ్యే సమయానికే టూరిజం ప్రాజెక్టులను కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు. రివర్ ఫ్రంట్ టూరిజంపై శుక్రవారం ఏడిసిఎల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అమరావతిలో అభివృద్ధి చేయనున్న పలు టూరిజం ప్రాజెక్టుల ప్రణాళికలు, అమలు పురోగతి, తదుపరి కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు. దీనికి ఎడిసిఎల్ ఛైర్‌పర్సన్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాజధాని అమరావతిలో ప్రపంచ స్థాయి రివర్‌ఫ్రంట్ టూరిజం అభివృద్ధిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అమ్యూజ్‌మెంట్ పార్క్, ఎకో టూరిజం పార్కులను పబ్లిక్–ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ విధానంలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనలను పరిగణనలోకి తీసుకుని దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో టూరిజం ప్రాజెక్టులను వేగవంతంగా అమలు చేయాలని మంత్రి స్పష్టం చేశారు. టూరిజం ప్రాజెక్టుల కోసం ఇప్పటికే భూములు కేటాయించుకున్న సంస్థలు ఆలస్యం చేయకుండా వెంటనే పనులు ప్రారంభించేలా అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాజధాని అమరావతిని పర్యాటక రంగంలోనూ ప్రత్యేక గమ్యస్థానంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతోందని మంత్రి తెలిపారు.








కామెంట్‌లు (0)