హైకోర్టుకు భారీగా వచ్చిన బాధితులు
ప్రజాశక్తి-అమరావతి : పశ్చిమ గోదావరి జిల్లా తణుకుకు చెందిన చిట్టీల కంపెనీ నిర్వాహకులు రూ.42 కోట్ల మేర మోసానికి పాల్పడ్డారన్న ఆరోపణలతో బాధితులు హైకోర్టుకు శుక్రవారం భారీగా తరలివచ్చారు. తణుకు, ఇరగవరం, పెనుమంట్ర, అత్తిలి మండలాలకు చెందిన దాదాపు 300 మంది బాధితులు బస్సులు, వ్యాన్లలో హైకోర్టుకొచ్చారు. చిట్టీల చెల్లింపులకు సంబంధించిన రసీదులు, పుస్తకాలను వెంట తెచ్చుకున్నారు. నిందితులు డబ్బులు తిరిగి చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పడంతో వాళ్లంతా హైకోర్టుకు చేరుకున్నారు. తణుకుకు చెందిన గోలి శ్రీనివాసరావు, ఆయన కుమారుడు గోలి బాల భవానీ శంకర్ ‘శ్రీ దుర్గ భవానీ చిట్స్ అండ్ ఫైనాన్స్’ పేరుతో చిట్టీలు నిర్వహిస్తూ ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. చిట్టీల సొమ్ము చెల్లించకపోవడంతో బాధితుల ఫిర్యాదు మేరకు ఆగస్టు 13న తణుకు టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ తండ్రీకొడుకులు హైకోర్టును ఆశ్రయించారు. ఇటీవల విచారణ సందర్భంగా బాధితులకు చెల్లించాల్సిన మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని వారి తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు. దీంతో నిందితులతోపాటు ఫిర్యాదుదారులను విచారణకు హాజరుపరచాలని జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు పోలీసులను ఆదేశించారు. శుక్రవారం విచారణ సందర్భంగా బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నిందితులు తమ ముందస్తు బెయిల్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు. అందుకు హైకోర్టు అనుమతించింది. అనంతరం నిందితులు బయటకు వెళ్లేందుకు ప్రయత్నించగా.. బాధితులు వారి కారును అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు జోక్యం చేసుకుని బాధితులను అక్కడి నుంచి పంపించి, నిందితులను తుళ్లూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. హైకోర్టు కేసు విచారణ వాయిదా పడింది.








కామెంట్‌లు (0)