టెలీకాన్ఫరెన్స్‌లో సిఎం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా రూ.188 కోట్లు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. పొగాకు ధరల స్థిరీకరణ, రైతుల ప్రయోజనాలపై ముఖ్యమంత్రి సోమవారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధరల లోటు భర్తీ కింద రైతులకు కిలో పొగాకుకు రూ.20 చొప్పున అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొత్తం 94 మిలియన్ కిలోల పొగాకు కొనుగోళ్లకు మద్దతు కల్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పొగాకు ధరలు తగ్గకుండా అవసరమైన అన్ని చర్యలూ తీసుకోవాలని అధికారులను ఆదేశిం చారు. బ్రైట్ రకం పొగాకు కిలోకు కనీసం రూ.240, మీడియం రకానికి రూ.190, లో గ్రేడ్ పొగాకు రూ.110 కంటే తక్కువకు పడిపోకుండా చూడాలని సూచించారు. వివిధ ప్రతిపాదనలపై చర్చించిన అనంతరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉమ్మడిగా రైతులకు మద్దతు కల్పించేలా తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. టెలీకాన్ఫరెన్స్‌లో వ్యవసాయశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు, వ్యవసాయ శాఖ అధికారులు, పొగాకు బోర్డు అధికారులు తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)