- సాయికృష్ణ తల్లికి సిఎం చంద్రబాబు హామీ
- ఇప్పటికే సిఐపై వేటు వేశాం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో / విజయవాడ : విజయవాడలోని కృష్ణలంకకు చెందిన గాదె సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి, అతని కుటుంబ సభ్యులు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును కలిశారు. ఉండవల్లిలోని సిఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రిని శుక్రవారం కలిసిన సాయికృష్ణ తల్లి తన కుమారుడి అదృశ్యంపై విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. ఈ సందర్భంగా ఆమెకు ముఖ్యమంత్రి ధైర్యం చెప్పారు. ఈ ఘటనపై నిష్పక్షపాతంగా ఉన్నతస్థాయి దర్యాప్తు చేయిస్తున్నామని తెలిపారు. ఇప్పటికే సిఐ నాగరాజును సస్పెండ్ చేశామని, పోలీసు ఉన్నతాధికారుల నేతృత్వంలో దర్యాప్తును వేగవంతం చేశామన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులకు శిక్ష పడేలా చేస్తామని చెప్పారు. ఈ విషయంలో తప్పుచేసింది ఎంతటివారైనా ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రిని కలిసిన అనంతరం సాయికృష్ణ మేనమామ నవరంగ్ కుటుంబ సభ్యులతో కలిసి వీడియాతో మాట్లాడుతూ.. తమకు జరిగిన అన్యాయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లామని తెలిపారు. సాయికృష్ణ తల్లి బాధను సిఎం చంద్రబాబు అర్థం చేసుకున్నారని వెల్లడించారు. మాలాంటి సామాన్యులకు న్యాయం జరగదని ఇప్పటి వరకూ భావించామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్ చొరవతో న్యాయం జరుగుతుందనే నమ్మకం వచ్చిందని అన్నారు. రాజకీయంగా మాకు ఎవరిపైనా ద్వేషం లేదని చెప్పారు. ఇలాంటి అన్యాయం మరో మనిషికి జరగకూడదని పేర్కొన్నారు.
సిఐ నాగరాజుపై కేసు నమోదు
గాదె సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధిం చి సస్పెండైన విజయవాడ కృష్ణలంక సిఐ నాగరాజుపై పోలీసులు కేసు నమోదు చేశారు. సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు.. సిఐపై హత్యాయత్నం సహా పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. ముందుగా గురువారం రాత్రి 11 గంటల సమయంలో బాధితుడి తల్లి, కుటుంబ సభ్యులకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు నుంచి పిలుపు వచ్చింది. ఆ తర్వాతే నాగరాజుపై ఆమె ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదును కమిషనర్ స్వయంగా స్వీకరించి విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ఫిర్యాదు కాపీని విజయలక్ష్మికి అందజేశారు.
విచారణ ప్రారంభం..
మరోవైపు ఈ కేసులో దర్యాప్తు అధికారిగా నియమితులైన దిశా పోలీస్ స్టేషన్ ఎసిపి దైవ ప్రసాద్ శుక్రవారం నుంచే విచారణ ప్రారంభించారు. ఆయన నేతృత్వంలో ఇద్దరు సిఐలు, ఇద్దరు ఎస్‌ఐల బృందం సాయికృష్ణ ఇంటికి వెళ్లింది. అయితే సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆసుపత్రికి వెళ్లడంతో వారి నివాసంలోనే కొద్దిసేపు దర్యాప్తు అధికారులు వేచి ఉన్నారు. ఆ తర్వాత సాయికృష్ణ తల్లి స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసుకున్నారు. విచారణ అధికారి దైవ ప్రసాద్‌తో సాయికృష్ణ మేనమామ మాట్లాడుతూ.. ‘‘సిఐ చంపింది ఒకరిని కాదు.. ఇద్దరిని’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సాయికృష్ణని భౌతికంగా చంపితే.. అతడి తల్లిని మానసికంగా చంపారు అంటూ ఘాటుగా స్పందించినట్టు తెలిపింది. ఈ కేసులో ఆధారాల సేకరణ కోసం పోలీస్‌స్టేషన్‌ను ఫోరెన్సిక్ టీము పరిశీలించింది. విచారణలో భాగంగా ఈ కేసుకు సంబంధించి విజయవాడ టాస్క్‌ఫోర్స్ ఎసిపి లలిత కుమారిని కృష్ణలంక పోలీసుస్టేషన్‌కు పిలిచారు. మరోవైపు సాయికృష్ణ అదృశ్యంపై దర్యాప్తు అధికారిగా నియమితులైన రాజమహేంద్రవరం ఎస్‌పి నరసింహ కిశోర్.. విజయవాడ వచ్చి విచారణ ప్రారంభించనున్నట్లు తెలిసింది.
తక్షణమే సిట్‌తో దర్యాప్తు చేయాలి
- సాయికృష్ణ, క్రాంతి కుమార్ కేసుల్లో ఎన్‌హెచ్ఆర్‌సికి వైసిపి వినతి
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సాయికృష్ణ, క్రాంతికుమార్ కేసులపై తక్షణమే సిట్‌తో దర్యాప్తు చేయించాలని, బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలని వైసిపి ఎంపిలు డిమాండ్ చేశారు. శుక్రవారం నాడిక్కడ జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ఆర్‌సి) చైర్మన్‌ను వైసిపి ఎంపిలు మద్దిల గురుమూర్తి, తనూజరాణి కలిసి, వినతిపత్రం అందజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ సిఐ నాగరాజు వేధింపుల కారణంగా ఆత్మహత్య చేసుకున్న క్రాంతికుమార్, లాకప్ డెత్‌కు గురైన గాదె సాయికృష్ణ కేసుల్లో బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఈ రెండు కేసుల్లో తక్షణమే దర్యాప్తు జరపించాలని డిమాండ్ చేశారు. సాయికృష్ణ లాకప్‌డెత్, క్రాంతి కుమార్ ఆత్మహత్యల వెనుక ఉన్న నిజాలను బయటకు తీసి బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులపై సమగ్ర రిపోర్టును సమర్పించేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, పోలీసులను ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు.








కామెంట్‌లు (0)