పుష్కర ఘాట్ల పనుల్లో నాణ్యతాలోపం
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు రూ.158.15 కోట్లు
179 ఘాట్లలో పనుల నిర్వహణ
ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి
గోదావరి పుష్కరాల ఘాట్ల అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.210 కోట్ల భారీ నిధులు మంజూరు చేసినా, క్షేత్రస్థాయిలో మాత్రం మళ్లీ పాత కథే పునరావృతమవుతోంది. పనులు ప్రారంభ దశలోనే నాణ్యతా లోపాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ప్రధాన పుష్కర ఘాట్ లో యాత్రికుల భద్రతకు ముప్పు తెచ్చేలా 'జారిపోయే రాళ్లు' వాడుతున్నారంటూ స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు స్వయంగా విమర్శలు చేసినప్పటికీ, అధికారులు ఆ తప్పులను సరిదిద్దకపోవడం గమనార్హం. కొన్ని చోట్ల ఘాట్ల ప్రారంభానికి ముందే రాళ్లు బీటలు వారుతుండటం నాణ్యతా లోపానికి, పర్యవేక్షణా లోపానికి అద్దం పడుతోంది. పది నెలల్లో పనులు పూర్తి చేయాలనే హడావుడిలో నాణ్యతను గంగలో కలిపేస్తూ ప్రజాధనాన్ని నీటిపాలు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జారుడు రాళ్లను అమర్చడం, నిర్మాణ దశలోనే రాళ్లు విరిగిపోతుండటం కాంట్రాక్టర్ల నిర్లక్ష్యానికి, ఇంజనీరింగ్ అధికారుల నిద్రమత్తుకు నిదర్శనంగా నిలుస్తోంది.
అత్యధిక నిధులు ‘తూర్పు’నకే...
ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో 179 ఘాట్ల పనులకు రూ.158.15 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 70 ఘాట్లకు రూ.116.21 కోట్లు కేటాయించారు. కొవ్వూరు పరిధిలోని గోపాదం, కృష్ణచైతన్య, భక్తాంజనేయ, సుబ్రహ్మణ్యేశ్వర ఘాట్ల అభివృద్ధి, ఏకీకరణకు రూ.53.83 కోట్లు ఖర్చు చేయనున్నారు. మరోచోట 300 మీటర్ల కొత్త ఘాట్ నిర్మాణానికి రూ.8.48 కోట్లు, గౌతమి–అయ్యప్ప ఘాట్ల ఏకీకరణకు రూ.6.08 కోట్లు, కోటిలింగాల ఘాట్ అభివృద్ధికి రూ.7.96 కోట్లు కేటాయించారు. కాటన్ బ్యారేజీ వద్ద పెయింటింగ్, పునరుద్ధరణ పనులకు రూ.4.20 కోట్లు, మ్యూజియం భవనం మరమ్మతులు, ఇతర పనులకు రూ.3.52 కోట్లు మంజూరు చేశారు. కొవ్వూరులో నాలుగు ఘాట్ల అభివృద్ధి, ఏకీకరణకు రూ.53.83 కోట్లు కేటాయించారు. ఈ నిధులతో చేపట్టే పనుల్లో డిజైన్, నిర్మాణ సామర్థ్యం, రాళ్ల నాణ్యత, వరదలను తట్టుకునే విధానం వంటి అంశాలను అధికారులు ముందుగానే పరిశీలించాలి. పుష్కరాల సమయంలో వేలాది మంది యాత్రికులు ఒకేసారి ఘాట్లపైకి చేరనున్న నేపథ్యంలో చిన్న లోపం కూడా ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంది.
పనులు ప్రారంభంలోనే విమర్శలు
రాజమహేంద్రవరం ప్రధాన పుష్కర ఘాట్‌లో చేపట్టిన పనులు విమర్శలకు గురయ్యాయి. జారిపోయే రాళ్లు వినియోగించారంటూ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆరోపించిన విషయం తెలిసిందే. అయినా, ఆ రాళ్లను తొలగించకుండా యథాస్థితిలోనే ఘాట్లలో అమర్చారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొన్ని చోట్ల ప్రారంభానికి ముందే రాళ్లు బీటలు వారటం పర్యవేక్షణా లోపానికి దర్పణం పడుతోంది. గత తప్పిదాల నుంచి అధికారులు పాఠాలు నేర్చుకున్నారా? కాంట్రాక్టర్ల పనితీరుపై పర్యవేక్షణ ఉంటుందా? నాణ్యతా పరీక్షలు నిజంగానే జరుగుతాయా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ఆదేశాలు కాగితాలకే పరిమితం?
పనుల నాణ్యతలో రాజీ పడొద్దని ప్రభుత్వం స్పష్టంగా ఆదేశాలు జారీ చేసింది. సాంకేతిక అనుమతులకు ముందు ధరలు, డిజైన్లు, ఇసుక రవాణా ఛార్జీలను పరిశీలించాలని, ఒకే చోట రెండుసార్లు పనులు చేపట్టి నిధులు దుర్వినియోగం కాకుండా చూడాలని సూచించింది. ఈ ఆదేశాలు అమల్లో అధికార యంత్రాంగం చాలా కీలకం. కాగితాలపై నాణ్యతా ప్రమాణాలు ఉన్నంత మాత్రాన ప్రయోజనం లేదు. పనులు జరుగుతున్న ప్రతి దశలో ఇంజనీరింగ్ అధికారులు తనిఖీలు నిర్వహించాలి. ఉపయోగించే రాళ్లు, సిమెంట్, ఇసుక తదితర నిర్మాణ సామగ్రిని పరీక్షించాలి. పనులు పూర్తయిన తర్వాత కాకుండా నిర్మాణ సమయంలోనే లోపాలను గుర్తించి సరిచేయాలి.
పుష్కరాలకు ఇక పది నెలలే...
పుష్కరాలకు పది నెలల సమయం మాత్రమే ఉంది. రూ.210 కోట్లతో 238 పనులు చేయాలి. హడావుడిగా పనులు పూర్తి చేయడం కంటే శాశ్వతంగా ఉపయోగపడేలా నిర్మాణాలు చేపట్టడం అవసరం. పుష్కరాలు ముగిసిన మరుసటి ఏడాదే మరమ్మతుల కోసం మళ్లీ కోట్ల రూపాయలు కేటాయించే పరిస్థితి రాకూడదు. పుష్కర ఘాట్లకు పుష్కలంగా నిధులు రావడం స్వాగతించాల్సిన విషయమే. కానీ నిధులు విడుదల చేయడం ఒక ఎత్తయితే.. వాటితో నాణ్యమైన పనులు చేయించడం మరో ఎత్తు. ప్రజాధనం ఖర్చవుతున్నందున ప్రతి రూపాయికీ లెక్క ఉండాలి. ప్రతి పనికీ నాణ్యతా ప్రమాణం ఉండాలి. ప్రతి అధికారికీ జవాబుదారీతనం ఉండాలి. తూర్పుగోదావరి జిల్లాకు అత్యధిక నిధులు తీసుకొచ్చేందుకు ప్రజప్రతినిధులు చేసిన కృషి అభినందనీయమే.
అయితే ఆ పనులపై పర్యవేక్షణ కూడా ఉండాలనేది అందరి నుంచి వస్తున్న మాట. గతంలో వచ్చిన విమర్శలు మళ్లీ పునరావృతం కాకుండా నాణ్యతా తనిఖీలు, పనుల పురోగతిపై బహిరంగ వివరాలు, పూర్తయిన పనులపై భద్రతా ధ్రువీకరణ వంటి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.








కామెంట్‌లు (0)