ప్రజాశక్తి – కోరుకొండ (తూర్పు గోదావరి) : వీఆర్ఏల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కోరుకొండ మండలంలో వీఆర్ఏలు నాలుగో రోజు సమ్మెను కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా కోరుకొండ మండల వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు కొందూరు కన్నయ్య మాట్లాడుతూ.. వీఆర్ఏలుగా పనిచేస్తున్న తమకు తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల మేరకు వేతనాలు, ఇతర ప్రయోజనాలు కల్పించాలని డిమాండ్ చేశారు. వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని, నామినీ వీఆర్ఏలను గుర్తించాలని, అటెండర్లు, వాచ్‌మెన్లుగా పనిచేస్తున్న వారికి వీఆర్ఏలుగా పదోన్నతి కల్పించాలని కోరారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం రూ.26 వేల వేతనం అందించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం తమకు కేవలం రూ.11 వేల వేతనం మాత్రమే అందుతోందని, పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, కూరగాయలు, వంట నూనె, పిల్లల విద్యా ఫీజులు తదితర ఖర్చులతో కుటుంబాలను పోషించడం తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేసి సుమారు రూ.30 వేల వరకు వేతనం అందిస్తున్నారని, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం ఇప్పటికీ తక్కువ వేతనంతో పనిచేస్తున్నామని తెలిపారు. కోరుకొండ మండలంలోని 22 గ్రామాల్లో మొత్తం 32 మంది వీఆర్ఏలు ఉన్నారని తెలిపారు. తమ సమస్యల పరిష్కారం కోసం కోరుకొండ తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేసినట్లు చెప్పారు. అనంతరం వీఆర్ఏలంతా టెంట్లు ఏర్పాటు చేసుకుని అక్కడే నిరసన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించి న్యాయం చేసే వరకు 32 మంది వీఆర్ఏలు టెంట్ల వద్దే నిరసన కొనసాగిస్తామని స్పష్టం చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉద్ధృతం చేస్తామని, తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని మీడియా ద్వారా కోరుతున్నట్లు వీఆర్ఏల సంఘం అధ్యక్షుడు కొందూరు కన్నయ్య తెలిపారు.
సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె కొనసాగిస్తాం : వీఆర్ఎ లు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 20, 2026, 12:36 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)