ఎక్స్‌లెన్స్ పేరుతో అక్కడి విద్యార్ధులు మరోచోటికి తరలింపు
రాష్ట్రంలో మూడు చోట్ల ఏర్పాటు
కేవలం వేతనాలకే ఒక్కొదానికి 3.9కోట్లు ఖర్చు
వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రప్రభుత్వం సాంఘిక సంక్షేమ గురుకులాలను కార్పొరేట్లకు కట్టబెట్టందుకు నిర్ణయం తీసుకుంది. అక్కడ ఉన్న ప్రభుత్వ వనరులతో పాటు అదనంగా కోట్ల రూపాయలు అప్పజెప్పి కార్పొరేట్ సంస్థలను పోషించే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెంటర్స్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ జెఇఇ, ఐఐటి, నీట్ శిక్షణ పేరుతో రాష్ట్రంలో మూడు చోట్ల ఉన్న గురుకులాలను కార్పొరేట్ సంస్థలకు అప్పగించేందుకు ఇటీవల మంత్రివర్గం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. గుంటూరు జిల్లాలోని తాడికొండ, విశాఖపట్నం జిల్లా మెగాద్రిగడ్డ, నెల్లూరు జిల్లా కోటలోని బిఆర్ అంబేద్కర్ గురుకులాల్లో జెఇఇ,ఐటిఐ, నీట్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. విశాఖపట్నంలో బాలికలకు, తాడికొండ, కోట గురుకులాల్లో బాలురకు శిక్షణ ఇవ్వనుంది. ఈ నిర్ణయం మంచిదే అయినా దీనికోసం ఆచరించే విధానం మాత్రం సరైంది కాదని విద్యావేత్తలు,ప్రజాసంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీటి నిర్వహణను కార్పొరేట్ ఏజెన్సీలకు అప్పగించాలని తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు.
ఆ మంత్రికి చెందిన సంస్థకేనా?
ఐఐటీ,జెఇఇ, నీట్ పరీక్షల్లో శిక్షణ ఇచ్చే అనుభవం ఉన్న ఏజెన్సీలకు ఈ శిక్షణ కేంద్రాలను అప్పగించే ఏర్పాట్లు చేయాలని ఈ నెల 11వ తేదిన రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. ఈ నిబంధన కేవలం ఎంపిక చేసిన ఒక కార్పొరేట్ విద్య సంస్థకే అప్పగించేలా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఆ కార్పొరేట్ సంస్థ కూడా ప్రస్తుతం మంత్రివర్గంలో ఉన్న ఒక సీనియర్ మంత్రికి చెందినదే అనే చర్చ నడుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రతి మండలంలో ఆయన తన కార్పొరేట్ సంస్థను నెలకొల్పారు. ఇప్పుడు అనుభవం అనే నిబంధన పేరుతో ఆ సీనియర్ మంత్రికి చెందిన కార్పొరేట్ సంస్థకు కట్టబెట్టేందుకే ప్రభుత్వం ఈ నిబంధన తీసుకొచ్చిట్లు తెలుస్తోంది. ఒక్కొ కేంద్రం నిర్వహణకు రూ.3.9కోట్లను రాష్ట్రప్రభుత్వం కేటాయించనుంది. ఈ బడ్జెట్ కార్పొరేట్ ఏజెన్సీ ద్వారా వచ్చే అధ్యాపకులు, విద్యాసంబంధిత కార్యక్రమాల కోసమే అని ప్రభుత్వం నిబంధనల్లో పేర్కొంది. విద్యార్ధులకు వసతి, భోజన సదుపాయాలు, నిర్వహణ, ఇతర ఖర్చులకు అవసరమైన నిధులను ఎపి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యూకేషనల్ ఇనిస్టిట్యూషన్ సొసైటీనే ఖర్చు చేస్తుందని పేర్కొంది.
ఇతర ప్రాంతాలకు విద్యార్ధుల తరలింపు
ప్రభుత్వం ఎంపిక చేసిన మూడు గురుకులాల్లోని విద్యార్ధులను ఇతర చోట్లకు బలవంతంగా పంపుతోంది. ఇప్పటికే తాడికొండ గురుకులాల్లోని విద్యార్ధులను అక్కడి నుంచి మరో గురుకులానికి తరిలించేందుకు ప్రయత్నించడంతో తల్లిదండ్రులతో పాటు, విద్యార్ధి సంఘాలు, ఇతర ప్రజాసంఘాలు ఆందోళన బాటపట్టారు. మిగిలిన చోట్ల కూడా ఇలానే విద్యార్ధులను తరలించేందుకు సాంఘిక సంక్షేమ శాఖ ఏర్పాట్లు చేస్తునట్లు సమాచారం. కార్పొరేట్ సంస్థలకు గురుకులాలను అప్పగించడాన్ని విద్యార్ధి, ప్రజాసంఘాలతో పాటు పలు రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ప్రభుత్వ వనరులు, నిధులను కార్పొరేట్లకు దోచిపెట్టడం సరికాదని చెబుతున్నారు. కార్పొరేట్‌కు అప్పగించకుండా ప్రభుత్వమే వీటిని నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.








కామెంట్‌లు (0)