ఎస్ఎఫ్ఐ అఖిలభారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల సమస్యల పరిష్కారం కోరుతూ దేశవ్యాప్తంగా ‘స్కూల్ బచావో’ ఉద్యమాన్ని చేపట్టనున్నామని ఎస్ఎఫ్ఐ అఖిల భారత అధ్యక్షులు ఆదర్శ్ ఎం.సాజీ వెల్లడించారు. శ్రీకాకుళం నగరంలోని ఒక ఫంక్షన్ హాల్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు డి.చందు అధ్యక్షతన మంగళవారం నిర్వహించిన ‘జెన్-జెడ్’ సెమినార్‌లో ముఖ్య అతిథిగా ఆయన ప్రసంగించారు. దేశంలో పదేళ్ల కాలంలో 1.20 లక్షలకు పైగా పాఠశాలలు మూతపడ్డాయని, లక్షకు పైగా స్కూళ్లలో మరుగుదొడ్లు లేవని తెలిపారు. దేశంలో రెండు లక్షల పాఠశాలలకు విద్యుత్ సౌకర్యం, ఆరు లక్షలకు పైగా స్కూళ్లకు కనీసం ఇంటర్నెట్ సౌకర్యం లేదని వివరించారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విద్యారంగాన్ని కాషాయీకరణ, కేంద్రీకరణ చేసే ప్రయత్నాలు చేస్తోందని. రాష్ట్రంలోని టిడిపి కూటమి ప్రభుత్వం కూడా విద్యారంగాన్ని నిర్వీర్యం చేసే విధానాలను అవలంభిస్తోందని విమర్శించారు. పాఠశాలల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో మౌలిక వసతులపై సర్వే జరగుతోందని, ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుంటే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు పి.రామ్మోహన్ మాట్లాడుతూ వసతిగృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులు మౌలిక వసతుల్లేక పలు ఘటనల్లో మృత్యువాత పడుతున్నా, ప్రభుత్వం ఆ కుటుంబాలకు కనీసం ఎక్స్‌గ్రేషియో కూడా ఇచ్చి ఆదుకోవడం లేదన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జీలు, పారా మెడికల్ సిబ్బంది సమస్యల పరిష్కారం కోసం అడిగితే డబ్బులు లేవని ప్రభుత్వం చెప్తోందని, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు చెల్లింపుల కోసం ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయని ప్రశ్నించారు. అంతకుముందు భగత్‌సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు శాస్త్రీయ, వెస్ర్టన్ గీతాలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. సెమినార్‌లో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి పి.ఖగేష్, గర్ల్స్ కన్వీనర్ పి.దివ్య జిల్లా కమిటీ సభ్యులు మురళి, వెయ్యి మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)