- విశాఖలో ఉదయం నుంచి రాత్రి వరకూ రోడ్డుపై బైఠాయింపు
- ప్రొబేషన్ కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించాలని డిమాండ్
ప్రజాశక్తి - కలెక్టరేట్ (విశాఖపట్నం) : తమ డిమాండ్లపై విశాఖ వేదికగా ఉద్యమిస్తున్న సచివాలయ ఉద్యోగుల ఆందోళనను ఆదివారం మరింత ఉధృతం చేశారు. జివిఎంసి గాంధీ విగ్రహం ఎదుట, ఆర్‌టిసి కాంప్లెక్స్ సమీపంలోని గురజాడ జంక్షన్ రోడ్డుపైనా బైఠాయించి భారీ నిరసన తెలిపారు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. తమ దగ్గర ఉన్న వస్తువులు, వాటర్ బాటిళ్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ‘ఉయ్ వాంట్ జస్టిస్’ అంటూ పెద్దపెట్టున నినదించారు. ఉదయం 11 గంటల నుంచి రాత్రి వరకు గురజాడ జంక్షన్ ప్రాంతంలో నిరసన కొనసాగించారు. ఈస్ట్ ఎసిపి కొండపల్లి లక్ష్మణమూర్తి, ద్వారక ఎసిపి మల్లేశ్వరరావు, ఎడిసిపి అన్నెపు నరసింహమూర్తి, సిఐలు అమ్మినాయుడు, ప్రభాకర్ తదితరులు ఆ ప్రాంతానికి చేరుకొని ఆందోళనకారులతో చర్చలు జరిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగించవద్దని, కేసులు పెడతామని హెచ్చరించారు. ఈ క్రమంలో పోలీసులకూ, ఆందోళకారులకూ మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసులు పలుమార్లు బెదిరింపులకు దిగినా ఆందోళనకారులు వెరవకుండా పోరాటాన్ని కొనసాగించారు.
అపస్మారక స్థితిలోకి ఉద్యోగి
సాయంత్రం 7.30 గంటల సమయంలో విశాఖ ఈస్ట్ జోన్‌కు చెందిన ఉద్యోగి రమణ అపస్మారక స్థితికి చేరుకోవడంతో వెంటనే చికిత్స నిమిత్తం కెజిహెచ్‌కు తరలించారు. మరో ఉద్యోగి కూడా అస్వస్థతకు గురైనట్లు తెలిసింది. దీంతో ఆందోళన ప్రదేశంలో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
డిమాండ్లను నెరవేర్చాలి: నాయకులు
ప్రొబేషన్ కాలాన్ని రెగ్యులర్ సర్వీసుగా పరిగణించాలని, నోషనల్ ఇంక్రిమెంట్లు, బకాయి పడిన డిఎ, హెచ్ఆర్ఎ వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జోన్-1 జిల్లాల ఎస్‌జిఎస్‌డబ్ల్యు ఉద్యోగ సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో జివిఎంసి గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం జెఎసి చైర్మన్ ఎస్ నాగేశ్వరరావు, కన్వీనర్ భార్గవ్ సుతేజ్ మాట్లాడారు. ఆరేళ్ల సర్వీసు పూర్తయిన వారికి వెంటనే 'స్పెషల్ గ్రేడ్ స్కేల్' (ఎఎఎస్) మంజూరు చేయాలని, ప్రొబేషన్ ఆలస్యమైన తొమ్మిది నెలల కాలానికి ఎరియర్స్, వార్షిక ఇంక్రిమెంట్ పెంచాలని కోరారు. కనీస మూలవేతనం రూ.30 వేలకు తగ్గకుండా ప్రమోషన్ ఛానల్ కల్పించాలని, జిఒ 11ను రద్దు చేయాలని, మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు రావలసిన అన్ని ప్రయోజనాలను మూడు నెలలలోపు అందించి కుటుంబంలో ఒకరికి కారుణ్య నియామక ప్రక్రియ పూర్తి చేయాలని డిమాండ్ చేశారు.








కామెంట్‌లు (0)