శనివారం, 05 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఐద్వా సీనియర్‌ నాయకులు స్వరాజ్యేశ్వరమ్మ కన్నుమూత

58 నిమిషాల క్రితం

aidwa
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 06, 2026, 12:54 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

ప్రజాశక్తి- హైదరాబాద్‌, అమరావతి బ్యూరోలు : ఐద్వా భద్రాచలం డివిజన్‌ ‌మొదటితరం నాయకులు కొమరం స్వరాజ్యేశ్వరమ్మ కన్నుమూశారు. వయోభారంతో తన స్వగ్రామంలో శనివారం తుదిశ్వాస విడిచారు. ఆమెకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఐద్వా భద్రాచలం డివిజన్‌ అధ్యక్షులుగా, కార్యదర్శిగా స్వరాజ్యేశ్వరమ్మ పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులుగా సేవలందించారు. మావోయిస్టుల బెదిరింపులను లెక్కచేయకుండా ఏజెన్సీ ప్రాంతంలో తునికాకు కార్మికుల పక్షాన ఉద్యమాన్ని నడిపారు. పర్ణశాల సమీపంలోని సీతానగరం గ్రామ సర్పంచ్‌‌గా, ఎంపిటిసి సభ్యులుగా పనిచేశారు. ఆమె భౌతికకాయాన్ని ఐద్వా భద్రాద్రి జిల్లా అధ్యక్షులు డి.సీతాలక్ష్మి, భద్రాచలం టౌన్‌ అధ్యక్షులు గంటి జీవనజ్యోతి, జిల్లా కమిటీ సభ్యులు నాదెండ్ల లీలావతి, పూర్ణిమ, రవణమ్మ, నాగమణి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. కొమరం మండలం కరకగూడెం గ్రామంలో జన్మించిన స్వరాజ్యేశ్వరమ్మ చిన్ననాటి నుండే వామపక్ష భావజాలానికి ఆకర్షితమై ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. మహిళలు, వ్యవసాయ కార్మికులు, గిరిజన కార్మికుల సమస్యలపై జరిగిన అనేక పోరాటాలకు నాయకత్వం వహించారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రభుత్వ నిర్బంధాలను లెక్కచేయకుండా వ్యవసాయ కార్మికుల కూలి రేట్ల పెంపునకు ఉద్యమాన్ని ముందుకు నడిపించి విజయం సాధించారు. తునికాకు కార్మికుల కూలి రేట్ల పెంపునకు జరిగిన ఉద్యమంలో కార్మిక హక్కుల కోసం రాజీపడని నాయకులుగా నిలిచారు. పార్టీ నిర్ణయమే శిరోధార్యంగా భావించి కుటుంబబంధాలకు అతీతంగా సిద్ధాంతానికి కట్టుబడి పనిచేశారు.

మహిళా ఉద్యమానికి తీరనిలోటు : ఐద్వా

స్వరాజ్యేశ్వరమ్మ మృతి మహిళోద్యమానికి తీరని లోటని ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కె శ్రీదేవి, వి సావిత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పేగు బంధానికి తలొగ్గని ఉద్యమ స్ఫూర్తిని, ఆమె పోరాట జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. తన సొంత కుమార్తె ప్రత్యర్థి అభ్యర్థిగా పోటీ చేసిన ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థి విజయానికి కృషి చేసిన ఆమె నిబద్ధత నేటి తరం కార్యకర్తలకు ఆదర్శమని పేర్కొన్నారు. ప్రపంచీకరణ, కార్పొరేటీకరణ ప్రభావంతో మహిళలపై దాడులు, వివక్ష పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో స్వరాజ్యేశ్వరమ్మ వంటి ఉద్యమ నాయకుల పోరాట చరిత్రను నేటి తరం తెలుసుకోవాల్సిన అవసరముందని తెలిపారు. స్వరాజ్యేశ్వరమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆమెకు ఇచ్చే నిజమైన నివాళి అని పేర్కొన్నారు. ఆమె కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్