బుధవారం, 08 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionదద్దరిల్లిన పశ్చిమాసియా

2 గంటల క్రితం

iran
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 08, 2026, 11:10 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

రాత్రికి ఇరాన్‌‌పై భీకర దాడులు : ట్రంప్‌

• కాల్పుల విరమణ ముగిసిందని ప్రకటన

• 80కి పైగా లక్ష్యాలపై దాడులు

• దీటుగా స్పందించిన ఇరాన్‌

వాషింగ్టన్‌, టెహ్రాన్‌ : పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరోమారు తీవ్ర రూపం దాల్చాయి. ప్రపంచానికి శాంతిసందేశాలు వల్లించే అమెరికా, ఇరాన్‌ ‌సుప్రీం నేత ఖమేని హత్య చేయడంతో పాటు, ఆయన అంత్యక్రియల వేళ కనీస దౌత్య నీతి పాటించకుండా బుధవారం రాత్రి ఇరాన్‌‌పై భీకర దాడులు చేస్తామంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ‌బెదిరించారు. బుధవారం నాడు టర్కీలో జరుగుతున్న నాటో శిఖరాగ్ర సమావేశం అనంతరం ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌‌స్కీతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ఇరాన్ విద్యుత్ గ్రిడ్, వంతెనలు, మంచినీటి ప్లాంట్లను అమెరికా ఒక్క రోజులోనే పూర్తిగా కూల్చేస్తుందని ట్రంప్ హెచ్చరిస్తున్నారు. అలాగే, ఖార్గ్ ద్వీపంలోని ప్రధాన చమురు కేంద్రాన్ని కూడా అమెరికా సైన్యం స్వాధీనం చేసుకుంటుందన్నారు. మంగళవారం రాత్రి ఖార్గ్‌ ‌ద్వీపంపై దాడి చేసామన్నారు. ఇరాన్‌ ‌వైఖరికి వ్యతిరేకంగా ఈ రాత్రీకి భీకర దాడులు చేస్తామని, చాలా గట్టిగా దెబ్బతీస్తామని ప్రకటించారు. అయితే అమెరికా దాడులను ఇరాన్‌ ‌ప్రతిఘటించలేదని, వారు ఏమీ చేయలేరని ట్రంప్‌ ‌మీడియాకు చెప్పుకొచ్చారు. అలాగే, రష్యాపై తాము చేస్తున్న యుద్ధంలో అమెరికా మద్దతు ఇచ్చినందుకు ఆయనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ ధన్యవాదాలు తెలిపారు. అయితే ఈ సమావేశం అనంతరం ఇరు దేశాలు యుద్ధాన్ని ముగింపు పలకాలనుకుంటున్నారని ట్రంప్ తెలిపారు. అలాగే, కొత్త దఫా దాడులకు తెరలేపామని, ఇరాన్‌‌లో 80కి పైగా లక్ష్యాలపై దాడులు సాగించినట్లు అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌ ప్రకటించింది. ఇరాన్‌తో కాల్పుల విరమణ ముగిసిన అధ్యాయమని, వారితో మాట్లాడటం సమయం వృధా అని అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ‌కూడా తేల్చి చెప్పారు. ‘మాకు (అమెరికా) సంబంధించినంతవరకు కాల్పుల విరమణకు ఇక చెల్లుచీటీనే..’ అని పేర్కొన్నారు. ఇరాన్‌ ‌నేతలపైనా ఈ సందర్భంగా ట్రంప్‌ ‌నోరుపారేసుకున్నారు. ‘వారంతా నీచులు, వారికి నాయకత్వం వహిస్తున్నది మానసిక రోగులు’ అంటూ ఇష్టమొచ్చిన రీతిలో కారుకూతలు కూశారు. కాగా హర్మూజ్‌‌లో ఇరాన్‌ ‌దాడుల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య పరస్పర దాడులు, ఘర్షణ మొదలైంది. ట్రంప్‌ ‌వ్యాఖ్యలతో చమురు ధరలు గత రెండు వారాల్లో ఎన్నడూ లేని విధంగా ఒక్కసారిగా 5శాతం పెరిగాయి. ఇరు పక్షాలు పరస్పరం పలు లక్ష్యాలపై దాడులు జరిపాయి. దీంతో తాత్కాలిక ఒప్పందం చిక్కుల్లో పడింది. బుధవారం తెల్లవారు జామున బహ్రెయిన్‌‌ హోం శాఖ, కువైట్‌ ఆర్మీలు తమ వైమానిక రక్షణ వ్యవస్థలను ఉపయోగించి దాడులు జరిపాయి. అయితే వివరాలు తెలియరాలేదు.

​80కి పైగా లక్ష్యాలపై అమెరికా దాడులు

ఇరాన్‌‌పై కొత్త దఫా దాడులను ముగించినట్లు అమెరికా సెంట్రల్‌ ‌కమాండ్‌ ‌మంగళవారం తెలిపింది. తాజా దాడుల్లో 80కి పైగా లక్ష్యాలపై దాడులు చేసినట్లు వెల్లడించింది. ఇరాన్‌‌పై కొత్త దాడులు చేయడంతో పాటూ తన చమురును విక్రయించుకునేందుకు ఇరాన్‌‌కు గల లైసెన్స్‌‌ను కూడా అమెరికా రద్దు చేసింది. హర్మూజ్‌‌ జలసంధిలో క్షిపణుల దాడిలో మూడు ట్యాంకర్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఈ దాడులు చోటు చేసుకున్నాయి. ఇరాన్‌ ‌వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్‌, కంట్రోల్‌ ‌నెట్‌‌వర్క్‌‌లు, తీర ప్రాంత రాడార్లు, నౌకా విధ్వంసక క్షిపణి సామర్ధ్యాలపై అమెరికా బలగాలు దాడి చేశాయి. ఇస్లామిక్‌ ‌రివల్యూషనరీ గార్డ్‌ ‌కార్ప్స్‌‌కి చెందిన 60కి పైగా బోట్లపై కూడా దాడులు జరిగాయి. హర్మూజ్‌‌కు సమీపంలోనే ఈ దాడులు చోటు చేసుకున్నాయి. అంతర్జాతీయ వాణిజ్య కారిడార్‌ ‌ద్వారా జరిగే అంతర్జాతీయ వాణిజ్య కార్యకలాపాలపై దాడులు కొనసాగించేందుకు ఇరాన్‌‌కు గల సామర్ద్యాలను దెబ్బ తీయడమే ఈ దాడుల లక్ష్యం.’’ అని అమెరికా మిలటరీ ఒక ప్రకటనలో పేర్కొంది.

​ఉల్లంఘనలకు పాల్పడుతున్న అమెరికా

అమెరికా దురాక్రమణ చర్యలకు పాల్పడిం దంటూ ఈ దాడులకు తీవ్రంగా ప్రతిస్పందిస్తామని ఇరాన్‌ ‌జాయింట్‌ ‌మిలటరీ కమాండ్‌ ‌తెలిపింది. హర్మూజ్‌ ‌నిర్వహణలో అమెరికా జోక్యాన్ని సహించేది లేదని స్పష్టం చేసింది. జల సంధి చుట్టూ అనేక ప్రాంతాల్లో పలు పేలుళ్ళు చోటు చేసుకున్నాయని ఇరాన్‌ ‌ప్రభుత్వ మీడియా తెలిపింది. ఇరు పక్షాల మధ్య కుదిరిన అవగాహనా ఒప్పందాన్ని అమెరికా పదే పదే ఉల్లంఘిస్తోందని, ఇలాగే కొనసాగితే ప్రతీకార చర్యలు తప్పవని ఇరాన్‌ ‌విదేశాంగ శాఖ హెచ్చరించింది. అమెరికా విశ్వాస ఉల్లంఘన పర్యవసానాలు తీవ్రంగా వుంటాయని హెచ్చరిస్తూ, తమ జాతీయ ప్రయోజనాలు, భద్రతను పరిరక్షించేందుకు నిర్ణయాత్మక చర్యలు తీసుకుంటామని పేర్కొంది. ఈ మేరకు అధికార మీడియా ఒక ప్రకటన జారీ చేసింది.

రెండు దేశాలు ఒప్పందాన్ని పాటించాలి : చైనా

అమెరికా, ఇరాన్‌ల మధ్య మళ్లీ దాడులు జరుగుతున్న నేపథ్యంలో, ఇరు దేశాలూ తాము కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఒయు) పూర్తిగా అమలు చేయాలని, దాడులకు దూరంగా ఉండి చర్చల ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కోరింది. పశ్చిమాసియాలో తాజా పరిణామాలను తాము నిశితంగా గమనిస్తున్నామని, ఘర్షణలతో ఎటువంటి ప్రయోజనం ఉండదని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. సైనిక చర్యలతో మౌలిక సమస్యలు పరిష్కారం కావని ఆమె స్పష్టం చేశారు. "అమెరికా, ఇరాన్‌లు తాము సంతకం చేసిన అవగాహన ఒప్పందాన్ని పాటించాలని, చర్చలు, సంప్రదింపుల ద్వారా వివాదాలను పరిష్కరించుకోవాలని, బలప్రయోగానికి దూరంగా ఉండాలని మేము కోరుతున్నాం" అని ఆమె తెలిపారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్