-ఎపిఎస్ఆర్ టిసి వైస్‌ఛైర్మన్, ఎండి కోన శశిధర్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్ టిసి సేవల నాణ్యతను పెంచడంతో పాటు ఆదాయాభివృద్ధి, వనరుల సమర్థ వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎపిఎస్ఆర్ టిసి వైస్‌ఛైర్మన్, ఎండి కోన శశిధర్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆర్ టిసి హౌస్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు, హెచ్‌ఒడిలతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ విభాగాల కార్యకలాపాలు, పనితీరు, ఆదాయ వనరులు, ప్రగతిని అధికారులు పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బస్సుల నిర్వహణలో నాణ్యత, వాహనాల అందుబాటు, వనరుల సమర్థ వినియోగం, నిర్వహణ వ్యయాల నియంత్రణ, ఆదాయ పెంపుపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. బస్‌స్టేషన్లలో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. సంస్థ అభివృద్ధితోపాటు సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. సూపర్ సిక్స్‌లో భాగమైన స్త్రీ శక్తి పథక అమలును పర్యవేక్షిస్తూ మహిళలకు సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణం కల్పించాలని సూచించారు. దివ్యాంగ శక్తి పథకం అమలుపైనా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి క్షేత్రస్థాయి సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రయాణికుల సంతృప్తి పెంపు, ఆదాయాభివృద్ధి, వ్యయ నియంత్రణ, ఉద్యోగుల సంక్షేమానికి సమగ్ర ప్రాధాన్యత ఇవ్వాలని దిశానిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జాయింట్ ఎండి ఎం శివ ప్రసాద్, ఇడిలు కెఎస్ బ్రహ్మానందరెడ్డి, జివి రవివర్మ, రాఘవకుమార్, ఫైనాన్షియల్ అడ్వైజర్ ఎన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)