ప్రభుత్వ ఉత్తర్వులు
ఉపాధ్యాయ సంఘాలు హర్షం
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : సర్వీస్‌లో ఉన్న ఉపాధ్యాయులకు ప్రత్యేకంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి జె శ్యామలరావు జూన్ 25న విడుదల చేసిన ఈ ఉత్తర్వులు బుధవారం వెలుగులోకి వచ్చాయి. 2011కు ముందు డిఎస్‌సి ద్వారా నియాకమమైన ఉపాధ్యాయులకు 2028 ఆగస్టులోపు టెట్ అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ప్రత్యేక టెట్ నిర్వహిస్తున్నామని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రభుత్వం విడుదల చేసిన ఈ ఉత్తర్వులపై ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. కనీస మార్కులు, సిలబస్‌పై విద్యాశాఖ మంత్రి నిర్ణయం తీసుకోవాలని ఎస్‌టియు అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్ సాయి శ్రీనివాస్ ఒక ప్రకటనలో కోరారు. ప్రత్యేక టెట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో పెట్టాలని, సంబంధిత సబ్జెక్టులో మాత్రమే ప్రశ్నలు ఇవ్వాలని, అర్హత మార్కులు అందరికీ 40 మార్కులు (డిపార్ట్‌మెంటల్ టెస్టుల్లో పాస్ మాదిరి) ఉండేలా చర్యలు తీసుకోవాలని ఎపిటిఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు జి హృదయరాజు, ఎస్ చిరంజీవి కోరారు. ఉపాధ్యాయులకు టెట్‌ను రద్దు చేయాలని ఫ్యాప్టో డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసిందని తెలిపారు. రద్దు చేసేలోపు ఇన్-సర్వీస్ ఉపాధ్యాయులకు ప్రత్యేక టెట్ నిర్వహించాలని కోరినట్లు వివరించారు. ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్లో నిర్వహించి, అన్ని తరగతుల అభ్యర్థులకు ఒకే కనీస అర్హత మార్కు నిర్ణయించడం సముచితమని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మన్నం శ్రీనివాస్, రామిశెట్టి వెంకటేశ్వర్లు మరో ప్రకటనలో అభిప్రాయం వ్యక్తం చేశారు. ప్రత్యేక టెట్‌ను ఆఫ్‌లైన్‌లోనే నిర్వహించాలని స్కూల్ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాడిశెట్టి శ్రీనివాసులు, తమ్మినాన చందనరావు కోరారు.








కామెంట్‌లు (0)