- 2026–27 లక్ష్యాలు రెండు నెలల్లో పూర్తి కావాలి
- సమీక్షలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో
తీర ప్రాంత పర్యావరణ పరిరక్షణ, కోతల నివారణ చర్యల్లో భాగంగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టు గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ పనుల్లో వేగం మరింత పెరగాలని ఉప ముఖ్యమంత్రి, అటవీ పర్యావరణ శాఖల మంత్రి పవన్ కళ్యాణ్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది నిర్దేశిత లక్ష్యాలను వాతావరణ అనుకూలతల అనుగుణంగా వచ్చే రెండు నెలల్లో పూర్తి చేసేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ పనుల పురోగతిపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సోమవారం ఆయన సమీక్ష నిర్వహించారు. అసాధారణ వాతావరణ పరిస్థితుల నుంచి తీరాన్ని రక్షించుకోవడంలో గ్రేట్ గ్రీన్ వాల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కీలక భూమిక పోషించనుందని వెల్లడించారు. అందుకే కూటమి ప్రభుత్వం గ్రేట్ గ్రీన్ వాల్‌ను ప్రతిష్ఠాత్మకంగా ముందుకు తీసుకువెళ్తోందని చెప్పారు. రాష్ట్రంలో విస్తరించి ఉన్న 1,053 కిలోమీటర్ల తీర ప్రాంతం వెంబడి 5 కిలోమీటర్ల వెడల్పున పచ్చదనంతో కూడిన గోడను ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. అందులో ఈ ఏడాది 8,888 హెక్టార్లలో గ్రీన్ వాల్ విస్తరణకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశామని చెప్పారు. మొదటి అర్ధభాగంలో వాతావరణ అనుకూలతల ఆధారంగా కొంత మేర మొక్కలు నాటే ప్రక్రియ పూర్తయ్యిందని, ద్వితీయార్థంలో తాటి విత్తనాలు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో వీటి సేకరణ, నాటే ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొన్నారు. దాదాపు 5,000 హెక్టార్లలో తాటి వనాల ఏర్పాటును ఈ ఏడాది లక్ష్యంగా పెట్టుకున్నామని, కాలువ గట్లు, చెరువులు, తీర ప్రాంతాల్లో ఈ చెట్లు గాలి నిరోధక వ్యవస్థగా నిలుస్తాయని వివరించారు. తాటివనాలు, సామాజికవనాల ఏర్పాటు పట్ల ప్రజల్లో అవగాహన కల్పించాలని తెలిపారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత గడచిన రెండేళ్లలో మడ అడవుల పెంపకంలో చక్కటి పురోగతి సాధించామన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 740 హెక్టార్లు, 2025-26లో 1,930 హెక్టార్ల మేర మడ అడవుల విస్తరణ చేపట్టడంతో దేశంలోనే రెండో స్థానంలో నిలిచామని తెలిపారు. నవంబర్, డిసెంబర్ మాసాల్లో మిష్టి-2 కింద 305 హెక్టార్లలో మడ అడవుల పునరుద్ధరణ కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించామని చెప్పారు. గ్రేట్ గ్రీన్ వాల్ కార్యాచరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది 48 హెక్టార్లలో పరిహార అటవీకరణ చేపట్టామని, ఇది చాలా వరకు పూర్తి కావొచ్చిందన్నారు.







కామెంట్‌లు (0)