వర్క్‌షాప్‌లో వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి వీరపాండియన్
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:వ్యాధుల వ్యాప్తి, ఇతర ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించి, వాటి ప్రభావం పెరగకుండా చర్యలు తీసుకోవడంలో క్షేత్రస్థాయి సిబ్బంది కీలక పాత్ర పోషించాలని వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి జి వీరపాండియన్ అన్నారు. బిల్ అండ్ మిలిండా గేట్స్ ఫౌండేషన్ సహకారంతో, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్, ఐఐటి బాంబే తదితర భాగస్వామ్య సంస్థల సాంకేతిక సహకారంతో ఏర్పాటుచేస్తున్న ‘వ్యాధుల పర్యవేక్షణ, నిర్ణయాల సహాయక కేంద్రం’ కార్యకలాపాలు ఎలా ఉండాలన్న అంశంపై విజయవాడలో బుధవారం వర్క్‌షాప్ జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశాఖలో ఇప్పటికే అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా చేసుకుని రూపొందించిన ‘అవేర్’ వ్యాధి నమూనా, నిర్ణయ సహాయక వ్యవస్థ ద్వారా సంక్రమణ, అసంక్రమిత వ్యాధులను ముందుగానే అంచనా వేసే అవకాశం ఉందని చెప్పారు. ప్రజలకు అందాల్సిన వైద్య సేవలు, వ్యాధుల నివారణ చర్యలు సాంకేతిక సమస్యల కారణంగా ఆలస్యం కాకుండా ముందస్తు ప్రణాళికతో పనిచేయాలని ఆయన పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అక్కడి పరిస్థితులకు అనుగుణంగా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్,కెవిఎన్ చక్రధర్ బాబు, ఎన్టీఆర్ వైద్య సేవ సిఇవో ఎఎల్ పద్మావతి,ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ ఉపకులపతి పులాల చంద్రశేఖర్, వైద్య విద్య సంచాలకులు ఎ విష్ణువర్ధన్, ప్రజారోగ్య సంచాలకులు పద్మావతి, రిజిస్ట్రార్ టి సాయి సుధీర్ పాల్గొన్నారు.








కామెంట్‌లు (0)