సోమవారం, 14 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

కేసులు ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్త ఆందోళన

3 రోజుల క్రితం

dyfi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 11, 2026, 01:28 పూర్వాహ్నం | 2 నిమిషాల చదవడం

- 1,669 కానిస్టేబుళ్ల పోస్టులతో నిరుద్యోగులను మోసం చేయొద్దు

- రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో ప్రజా సంఘాల హెచ్చరిక

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్యను 11,639కి పెంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, శ్యామ్‌ సంస్థపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిఐటియు,యువజన, విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారంలోగా ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించాయి. గురువారం విజయవాడ బాలోత్సవ భవన్‌లో డివైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో రాష్ట్ర అధ్యక్షుడు ఎం రమణ అధ్యక్షతన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి రామన్న తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.ఈ సందర్భంగా సిఐటియు రాష్ట్ర కార్యదర్శి దాయ రమాదేవి, ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కె ప్రసన్న కుమార్, ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బందె నాసర్ జీ, రాష్ట్ర సహాయ కార్యదర్శి మాబూ సుభాని, పిడిఎస్ యు రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్, వైఎస్‌ఆర్‌ స్టూడెంట్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర, విద్యార్థి, యువజన జెఎసి కన్వీనర్ రామచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ పోస్టుల సంఖ్య పెంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని కోరుతూ నిరుద్యోగులు అనేక జిల్లాల్లో ఆందోళనలు నిర్వహిస్తున్నారని తెలిపారు. గతంలో హోంమంత్రి ప్రకటించిన 19,996 పోస్టులపై ప్రభుత్వం ప్రస్తుతం మాట్లాడటం లేదని విమర్శించారు. అనంతరం ఆర్థికశాఖ అనుమతికి పంపిన 11,639 పోస్టులను పక్కనపెట్టి కేవలం 1,669 పోస్టులతో నోటిఫికేషన్‌ ఇచ్చేందుకు సిద్ధమవడం నిరుద్యోగులను నయవంచన చేయడమేనని అన్నారు. ఎన్నికల ముందు ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. రెండేళ్ల తర్వాత జాబ్‌లెస్‌ క్యాలెండర్‌ను తీసుకొచ్చిందని అన్నారు. పోస్టుల సంఖ్యను పెంచకుండా కేవలం 1,669 పోస్టులతో భర్తీ ప్రక్రియ చేపట్టడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాకినాడలో డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, శ్యామ్‌ సంస్థపై నమోదు చేసిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో గంజాయి మాఫియా విచ్చలవిడిగా వ్యవహరిస్తూ ప్రజలపై దాడులకు పాల్పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. అనుమతులు లేకుండా అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ర్యాలీలు నిర్వహిస్తోన్న సందర్భాల్లో వారిపై కేసులు ఎందుకు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. నిరుద్యోగుల ఆందోళనలపైనే కేసులు పెట్టడం వివక్షకు నిదర్శనమని అన్నారు. కాకినాడ ఘటనలో తొలుత 20 మంది నిరుద్యోగ అభ్యర్థులపై కేసులు నమోదు చేయగా, రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వాటిని తొలగించారని వారు గుర్తు చేశారు. అదే విధంగా డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు, శ్యామ్‌ మాస్టర్‌ పై నమోదు చేసిన కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. పోస్టుల సంఖ్యను తక్షణమే పెంచి నోటిఫికేషన్‌ విడుదల చేయాలని, అక్రమ కేసులను ఎత్తివేయాలని కోరారు. లేనిపక్షంలో విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్‌ నాయకులు నాగభూషణం, సాయి, పిడిఎస్‌యు రాష్ట్ర నాయకులు వినోద్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి శివ, డివైఎఫ్‌ఐ నాయకులు గణేష్‌, నోహిత్‌కృష్ణ, గౌస్‌ తదితరులు పాల్గొన్నారు.​

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్