- త్వరితగతిన విచారించాలని సింగిల్ జడ్జికి హైకోర్టు సూచన
ప్రజాశక్తి-అమరావతి : గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొ రేషన్ (జివిఎంసి) వార్డుల పునర్విభజనపై సింగిల్ జడ్జి విధించిన మధ్యంతర స్టేను హైకోర్టు డివిజన్ బెంచ్ రద్దు చేసింది. త్వరితగతిన విచారణ జరిపి తుది నిర్ణయం తీసుకోవాలని సింగిల్ బెంచ్‌కు సూచించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ నేతృత్వంలోని ధర్మాసనం, న్యాయమూర్తి జస్టిస్ చల్లా గుణరంజన్‌తో కలిసి ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసు మూల అంశాలు, వాటి పరిశీలన పూర్తిగా సింగిల్ జడ్జి పరిధిలోనే ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. 3 నుంచి 4 వారాల్లో తుది నోటిఫికేషన్ వెలువడే అవకాశముందని అడ్వకేట్ జనరల్ చేసిన వాదనను కోర్టు నమోదు చేసింది. ఈ నెల 11న విచారణకు రానున్న రిట్ పిటిషన్లపై పూర్తి స్థాయి వాదనలు వినిపిస్తామని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలియజేసిన విషయాన్నీ నమోదు చేసింది. సింగిల్ జడ్జి మధ్యంతర స్టే ఇవ్వడానికి సరైన కారణాలు కనిపించడం లేదని బెంచ్ అభిప్రాయపడింది. వార్డుల పునర్విభజన నోటిఫికేషన్‌పై పిటిషనర్లు ముందుగా అభ్యంతరాలు తెలియజేయలేదని గుర్తుచేసింది.








కామెంట్‌లు (0)