శనివారం, 04 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

నిర్దేశించిన ప్రాంతాల్లోనే వీధి వ్యాపారాలు

1 గంట క్రితం

vendors
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:38 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- 51 పట్టణ స్థానిక సంస్థల్లో 'స్ట్రీట్ వెండింగ్ ప్లాన్స్'

- జోన్లను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు

- టౌన్ వెండింగ్ కమిటీల ఏర్పాటు

- కమిటీ సూచనల ఆధారంగానే చర్యలు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో 51 పట్టణ స్థానిక సంస్థల్లో వీధి వ్యాపార ప్రణాళికలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు శనివారం పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌‌కుమార్‌ జిఓ 140 విడుదల చేశారు. వీధి వ్యాపారుల (జీవనోపాధి రక్షణ మరియు వీధి వ్యాపార నియంత్రణ) చట్టం, 2014లో సెక్షన్ 21(2) ప్రకారం రాష్ట్రంలోని 51 పట్టణ స్థానిక సంస్థలకు వీధి వ్యాపార ప్రణాళికలను ఆమోదించారు. కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం కార్పొరేషన్లతో పాటు భీమవరం, హిందూపూర్, గుంతకల్, తాడిపత్రి, తాడేపల్లిగూడెం, నరసాపురం, నిడదవోలు, మండపేట, పీఠాపురం, సామర్లకోట, పెద్దాపురం, నూజివీడు, వినుకొండ, పార్వతీపురం, పలాస-కాశీబుగ్గ, బొబ్బిలి, సాలూరు, ఆముదాలవలస, బద్వేల్, రాజంపేట, కదిరి, జంగారెడ్డిగూడెం, కనిగిరి, గిద్దలూరు, గూడూరుల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మిగిలిన పట్టణ స్థానిక సంస్థల కొరకు వీధి వ్యాపార ప్రణాళికలను త్వరలో విడుదల చేయనున్నారు. దీని ద్వారా వీధివ్యాపారులకు జీవనోపాధి రక్షణ, మెరుగైన ట్రాఫిక్ నిర్వహణ, పాదచారుల భద్రత బహిరంగ ప్రదేశాలను క్రమపద్ధతిలో వినియోగించడం వంటి ప్రయోజనాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతం పట్టణ ప్రాంతాల్లో ఎక్కడికక్కడ వీధి వ్యాపారులు ఉండటంతో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలుగుతోందని, శానిటేషన్‌ ‌సమస్య వస్తోందని, కొత్త నోటిఫికేషన్‌‌తో ఈ సమస్య చాలా వరకూ పరిష్కారం అవుతుందని వివరించారు. వీధి వ్యాపారులు, పట్టణ స్థానిక సంస్థలు టౌన్ వెండింగ్ కమిటీలకు స్పష్టమైన నిబంధనలనూ పేర్కొన్నారు. ఇక నుండి పట్టణాల్లో వ్యాపార కేంద్రాలు, వ్యాపారం నిర్వహించకూడదని ప్రాంతాలుగా విభజించారు. ఇక నుండి నగరాల్లో నిర్దేశించిన ప్రాంతాల్లో మాత్రమే వ్యాపారాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇప్పుడున్న వీధివ్యాపారులను అక్కడ నుండి తొలగించి నిర్దేశించిన ప్రాంతంలోనే వ్యాపారం నిర్వహించుకునేలా పట్టణ ప్రణాళికా విభాగానికి అధికారాలు ఇచ్చారు. పట్టణ స్థానిక సంస్థ చెప్పిన నిబంధనల మేరకు దుకాణాలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎక్కడా కూడా శాశ్వత లేదా పాక్షిక నిర్మాణాలను చేపట్టరాదని, వ్యాపారులు తమ కార్యకలాపాల వల్ల వాహనాల రాకపోకలకు, పాదచారుల కదలికలకు, అత్యవసర రెస్క్యూ మార్గాలకు లేదా జంక్షన్ల అంతరాయం లేకుండా చూసుకోవాలని తెలిపారు. నిబంధనల ప్రకారం చెత్త నిర్వహణ ఉండాలని, డ్రైనేజీలలో, బహిరంగ ప్రదేశాలలో వ్యర్థాలను వేయకూడదని పేర్కొన్నారు. రోడ్డు విస్తరణ, మౌలిక సదుపాయాల అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణ లేదా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా అవసరమైనప్పుడు పునరావాస సూచనలను పాటించాలని తెలిపారు. ఈ వ్యాపారాల నిర్వహణ కోసం ప్లానింగ్ అథారిటీ సంప్రదింపులతో టౌన్ వెండింగ్ కమిటీని నియమించనున్నారు. ఈ కమిటీ సిఫార్సుల ఆధారంగా ప్రతి ఐదేళ్లకు ఒకసారి వీధి వ్యాపార ప్రణాళికల్లో సవరణలు చేయనున్నారు. వ్యాపార నిర్వహణకు అవసరమైన ధృవీకరణ పత్రాలను, గుర్తింపు కార్డులనూ ఇవ్వనున్నారు. ఆమోదించబడిన ఈ వ్యాపార ప్రణాళికలను మాస్టర్ ప్లాన్లు, జోనల్ డెవలప్‌మెంట్ ప్లాన్లు, లేఅవుట్ ప్లాన్లు ఇతర ప్రాంతీయ ప్రణాళిక పత్రాలలో కూడా చేర్చనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీధి వ్యాపారులు ఇక నుండి రోడ్లపై కనిపించకూడదని అందులో షరతు విధించారు. ఇలా కనిపిస్తే వారిపై చర్యలు తీసుకునే బాధ్యతను కమిటీకి అప్పగించారు. స్ట్రీట్ వెండర్స్ చట్టం అమలుకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు, పట్టణ స్థానిక సంస్థలతో జరిపిన సంప్రదింపుల ఆధారంగా ఈ నోటిఫికేషన్ విడుదల చేసినట్లు వివరించారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్