- ప్రభుత్వ ఉద్యోగుల ప్రచారం చేస్తే కఠిన చర్యలు
- ఎన్నికల రెండు రోజుల ముందు మద్యం దుకాణాలు బంద్
- ప్రభుత్వ ఉత్తర్వులు
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : సాధారణ ఎన్నికల నేపథ్యంలో ఈనెల 28వ తేదీన సెలవు ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది. స్థానిక ఎన్నికలు జరిగే అన్ని జిల్లాలకూ సెలవు వర్తిస్తుందని పేర్కొంటూ పట్టణాభివృద్దిశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్కుమార్ శనివారం ఉత్తర్వులు జారీచేశారు. 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు సాధారణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్, 1981 ప్రకారం అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రైవేటు సంస్థలకు స్థానిక సెలవుదినం ప్రకటించడానికి జిల్లా కలెక్టర్లకు అధికారం ఇస్తున్నట్లు జిఓలో పేర్కొన్నారు. ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలాగే పోలింగు కేంద్రాలుగా ఉపయోగించడానికి అవసరమైన అన్ని ప్రభుత్వ, విద్యా సంస్థలు, ఇతర భవనాలకు పోలింగు ముందురోజు, కౌంటింగ్ రోజున సెలవు ప్రకటించాలనీ ఆదేశించారు.
ఎన్నికల్లో ప్రచారం చేస్తే కఠిన చర్యలు
రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల్లో ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ సివిల్ సర్వీసెస్ (కండక్ట్) రూల్స్, 1964 లో రూల్ 19 సబ్ సెక్షన్ (5), (6) ప్రకారం ప్రభుత్వ ఉద్యోగి స్థానిక సంస్థకు జరిగే ఎన్నికల్లో ప్రచారం చేయడం, జోక్యం చేసుకోవడం వంటి చర్యలకు దిగరాదని పేర్కొంది. అలాగే ఉద్యోగి ఎవరికి ఓటు వేసింది అనే విషయాన్ని బయటకు తెలపకూడదని పేర్కొంది. వాహనంపైనా నివాసస్థలంలో సొంత ఆస్తిపై ఎటువంటి ఎన్నికల చిహ్నాన్ని ప్రదర్శించకూడదని తెలిపింది. తాము ఏ పార్టీకి లేదా అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నామనే అనుమానానికి కూడా తావు ఇవ్వకూడదని పేర్కొంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొనకూడదని, ప్రచారం చేయడం, రాజకీయ సమావేశాలు, ర్యాలీలకు హాజరుకావడం కాకూడదని ఆదేశించింది.
48 గంటల ముందు మద్యం దుకాణాలు బంద్
రాష్ట్రంలో 13 మున్సిపల్ కార్పొరేషన్లు, 87 మున్సిపాలిటీలు / నగర పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్నికలరోజుకు 48 గంటల ముందు నుండి అన్ని మద్యం దుకాణాలు మూసేయాలని పట్టణాభివృద్దిశాఖ ఆదేశించింది. అలాగే ఓట్ల లెక్కింపు రోజున మద్యం దుకాణాలు మూసేయాలని పేర్కొంది. దీనిపై చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను ఆదేశించింది.








కామెంట్లు (0)