గురువారం, 08 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionమూడో రోజూ కొనసాగిన సమ్మె

5 గంటల క్రితం

మూడో రోజూ కొనసాగిన 
వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె image 1
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 08, 2026, 10:59 అపరాహ్నం | 3 నిమిషాల చదవడం

  • వైద్యారోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి : సిహెచ్‌ నర్సింగరావు

ప్రజాశక్తి- యంత్రాంగం : దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం కాలయాపన చేయడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె మూడో రోజూ కొనసాగింది. రెగ్యులరైజేషన్‌, వంద శాతం గ్రాస్‌ వేతనం అమలు చేయాలని, ప్రభుత్వోద్యోగులు మాదిరిగా మాకూ సెలవులు మంజూరు చేయాలని, హెల్త్ కార్డ్స్ సౌకర్యం కల్పించాలని, కాంట్రాక్ట్ ఉద్యోగ మరణిస్తే మృతిని కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని నినాదాలు చేశారు. విశాఖ కెజిహెచ్ వద్ద నిర్వహిస్తున్న సమ్మె శిబిరాన్ని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్.నర్సింగరావు సందర్శించి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న డైరెక్ట్ కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారా మెడికల్ సిబ్బందిని తక్షణం రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజులుగా 14,600 మంది సమ్మె చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం తక్షణం జోక్యం చేసుకొని, వారి సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను భయభ్రాంతులకు గురి చేయడానికి ఇచ్చిన షోకాజ్ నోటీసులను తక్షణం వెనక్కి తీసుకోవాలని, అధికారులు బెదిరింపులను ఆపాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం సమ్మెను పరిష్కరించని పక్షంలో సిఐటియు ప్రత్యక్షంగా ఈ సమ్మెలో రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొంటుందని హెచ్చరించారు. అనకాపల్లి, అల్లూరి, పోలవరం జిల్లాల్లోనూ సమ్మె కొనసాగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్ ధర్నా చౌక్ వద్ద నిర్వహిస్తోన్న నిరవధిక దీక్షల్లో ఎపి ఎంహెచ్‌సి జెఎసి జిల్లా అధ్యక్షులు పి.ప్రవీణ్‌కుమార్‌ మాట్లాడారు. ఎఐటియుసి జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు లింగం ఫిలిప్‌, ఒఎల్‌.రావు సంఘీభావం తెలిపారు. ​ప్రభుత్వం నుంచి ఎలాంటి సానుకూల స్పందనా రాకపోవడంతో అనంతపురం జిల్లాలోని వైద్య, ఆరోగ్య శాఖ కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి సమ్మెలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. దీంతో, అనంతపురం ప్రభుత్వ సర్వజనాసుపత్రితో పాటు జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్య సేవలు పూర్తిగా స్తంభించిపోయాయి. విజయనగరం సర్వజన ఆస్పత్రి ప్రధాన గేటు వద్ద జిల్లాలోని కాంట్రాక్ట్ ఉద్యోగులు 450 మంది చేపట్టిన సమ్మె కొనసాగింది. స్టాఫ్ నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసీ ఆఫీసర్లు, ఎఎంటి రేడియాలజీ, ఎక్సరే తదితర విభాగాల ఉద్యోగాలు విధులను బహిష్కరించి సమ్మెలో పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ మెడికల్ అండ్ హెల్త్ కాంట్రాక్ట్ ఎంప్లాయిస్ జెఎసి జిల్లా చైర్మన్ ఎస్.స్వాతి మాట్లాడారు. వారి సమ్మెకు సిపిఎం నాయకులు మద్దతు తెలిపారు. ఏలూరులో జిల్లాలోని 530 మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులను బహిష్కరించి కలెక్టరేట్ వద్ద పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. మోకాళ్లపై నిలబడి వినూత్నంగా తమ నిరసన తెలిపారు. కలెక్టర్ కె.వెట్రిసిల్వికి వినతిపత్రం అందించారు.

​​పారా మెడికల్‌ సిబ్బంది సమస్యలను తక్షణం పరిష్కరించాలి

: ఎ.వి.నాగేశ్వరరావు

పారా మెడికల్‌ సిబ్బంది సమస్యలను తక్షణమే పరిష్కరించాలి సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వి.నాగేశ్వరరావు డిమాండ్‌ ‌చేశారు. విజయవాడ కొత్త ప్రభుత్వాసుపత్రులో సమ్మె చేస్తున్న పారా మెడికల్ సిబ్బందిని ఆయన కలిసి వారి ఉద్యమానికి మద్దతు పలికారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలోని డైరెక్ట్ కాంట్రాక్ట్ పారా మెడికల్ సిబ్బంది గత రెండు నెలలుగా వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. జీతాలు, క్రమబద్ధీకరణ వంటి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ ‌చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పారా మెడికల్ సిబ్బంది సమస్యలను తక్ష‍ణం పరిష్కరించి పేదలకు వైద్య, ఆరోగ్య సేవల్లో అంతరాయం లేకుండా చూడాలని కోరారు. ఎన్‌‌టిఆర్‌ ‌జిల్లా నలుమూలల నుండి వచ్చిన సుమారు 200 మంది పారా మెడికల్‌ ‌సిబ్బంది ఈ ఆందోళనలో పాల్గొన్నారు. ఆస్ప్రతిలోని సిబ్బంది కూడా సమ్మెకు పూనుకోవడంతో పలు సేవలకు అంతరాయం కలిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు తూర్పు సిటీ ప్రధాన కార్యదర్శి ఎన్.నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతపురంలో కాంట్రాక్ట్ నర్సులు, పారా మెడికల్ ఉద్యోగులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో రిలే నిరాహార దీక్షలను కొనసాగించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్