బుధవారం, 29 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

మహిళను వివస్త్రను చేసి కొట్టడం మానవత్వానికే మచ్చ

18 జులై, 2026

ys jagan
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 18, 2026, 10:14 అపరాహ్నం | 2 నిమిషాల చదవడం

- గుంటూరు ఘటనపై వైసిపి అధినేత జగన్‌

‌ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : గుంటూరులో మహిళను వివస్త్రను చేసి కొట్టడం మానవత్వానికే మాయని మచ్చని, రాష్ట్రంలో శాంతిభద్రతల నిర్వహణ ఎంత ఘోరంగా విఫలమైందో చెప్పడానికి నిలువెత్తు నిదర్శనమని, ఈ దారుణానికి రాష్ట్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలని వైసిపి అధినేత జగన్‌ తెలిపారు. శనివారం సోషల్‌ ‌మీడియా వేదిక ఎక్స్‌‌లో దీనిపై స్పందించారు. బుధవారం ఘటన జరిగితే మూడు రోజులపాటు దాన్ని కప్పిపెట్టారని, చివరకు ఆ వీడియోలు సోషల్‌ మీడియాలో బయటకు వచ్చి, రాష్ట్ర ప్రజలంతా చూసి పరిపాలనను అసహ్యించుకున్న తర్వాత, ఇప్పుడు చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి హడావుడి చేయడం సిగ్గుచేటని తెలిపారు. ఆ వీడియోలు కప్పిపుచ్చేదానిపై శ్రద్ధచూపే బదులు, బుధవారమే తనపై తొలిసారే దాడి జరిగిన తర్వాత, బాధిత మహిళ వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు వారు స్పందించి ఉండి ఉంటే ఇంతటి ఘోరం జరిగి ఉండేది కాదని తెలిపారు. ఆమె ఫిర్యాదుపై వెంటనే కేసు నమోదు చేసి, నిందితులను అదుపులోకి తీసుకుని ఉంటే ఈ దారుణం జరిగేది కాదని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన మహిళకు రక్షణ కల్పించకుండా మౌనం వహించడం ఎంతవరకు న్యాయమని ప్రశ్నించారు. పోలీస్‌స్టేషన్లు ఉన్నది ఎందుకు? బాధితుల ఫిర్యాదులను స్వీకరించడానికా? లేక అధికార పార్టీ నాయకులు ఏమి చెబితే అది చేయడానికా? అని ప్రశ్నించారు. బాధితురాలికి అండగా నిలవకపోగా, పంచాయితీ చేయడానికి ప్రయత్నించారని, బాధితురాలి మాటకు, ఆమె ఫిర్యాదుకు విలువ లేదా? ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేరం జరుగుతున్నప్పుడు స్పందించకుండా, ప్రజల్లో ఆగ్రహం పెల్లుబికిన తర్వాత చర్యల పేరుతో హడావుడి చేయడం ఏ రకమైన పోలీసు చర్యో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండు చేశారు. రెడ్‌బుక్‌ రాజ్యాంగం పేరుతో ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలు, సోషల్‌మీడియా యాక్టివిస్టులపై ప్రభుత్వం దగ్గరుండి దాడులను ప్రోత్సహించిందని, ఆ అరాచకాలను కప్పిపుచ్చడానికి పోలీసు వ్యవస్థను రాజకీయ ఆయుధంగా మార్చిందని పేర్కొన్నారు. చట్టాన్ని అధికార పార్టీకి చుట్టంగా, ప్రతిపక్షాలపైనా, బాధితులపైనా వేధింపులకు, అక్రమ కేసులకు ఒక సాధనంగా మార్చి రాష్ట్రాన్ని జంగిల్‌రాజ్‌గా దిగజార్చిందని తెలిపారు. అధికార పార్టీ నాయకులు ఏం చేసినా ఈ పోలీసులు తమను రక్షిస్తారనే ధైర్యం ఈ రెడ్‌బుక్‌పాలనలో గ్రామాలు, వార్డులు, డివిజన్ల స్థాయి వరకూ పాకిందని విమర్శించారు. టీడీపీ కూటమికి చెందిన పలువురు నాయకులు దుశ్శాసనుల్లా తయారయ్యారని, ఎలాంటి దారుణాలు చేసినా, ముఖ్యంగా మహిళలపై దాడి చేసినా, వారిని అవమానించినా, వేధించినా తమకు ఏమీ కాదని, తమను కాపాడ్డానికి చంద్రబాబుగారు ఉన్నారనే ధైర్యం, వారిలో పెరిగిపోయి చివరకు రాష్ట్రంలో ఆడవాళ్లకు రక్షణ లేకుండా చేసిందని పేర్కొన్నారు. అధికార పార్టీ నాయకుల దురాగతాల నుంచి తమను తాము కాపాడుకోవాల్సిన దుస్థితిలోకి మహిళలను నెట్టేసిందని తెలిపారు. మహిళల ఆగ్రహమే ఈప్రభుత్వానికి తగిన బుద్ధిచెప్తుందని జగన్‌ ‌పేర్కొన్నారు.


సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్