-కలెక్టర్లు ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలి
-బుడగ జంగాలకు ఎస్‌సిల ప్రయోజనాలు
-సిఎం చంద్రబాబు నాయుడు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను సమగ్రంగా నమోదు చేసి, అవసరమైన శాఖలకు కేటాయించేలా సిసిఎల్‌ఎ ఆధ్వర్యంలో స్ట్రక్చర్డ్ ల్యాండ్ బ్యాంక్ పోర్టల్‌ను రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గురువారం రాష్ట్ర సచివాలయంలో8వ జిల్లా కలెక్టర్ల కాన్ఫరెన్సులో యాక్షన్ టేకెన్ రిపోర్టులపై చర్చ సందర్భంగా వేర్వేరు అంశాల మీద దిశానిర్దేశం చేశారు. ఏళ్ల తరబడి వినియోగంలో లేకుండా ఉన్న ప్రభుత్వ భూములను గుర్తించి, వాటి పూర్తి వివరాలను జిల్లాలు, ప్రభుత్వ శాఖల వారీగా పోర్టల్‌లో నమోదు చేయాలని స్పష్టం చేశారు. భూమి కొరత అభివృద్ధి కార్యక్రమాలకు అడ్డంకిగా మారకూడదని, ప్రాజెక్టులు మంజూరైన తర్వాత భూమి కోసం వెతికే పరిస్థితి కాకుండా ముందుగానే అవసరమైన భూమిని గుర్తించి సిద్ధంగా ఉంచాలని సూచించారు. జిల్లాలు, శాఖల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను నమోదు చేయాలని సిఎం దిశానిర్దేశం చేశారు. ఏ ప్రభుత్వ శాఖకు భూమి అవసరమైనా ఈ పోర్టల్ ద్వారా కేటాయించే పరిస్థితి ఉండాలని అన్నారు. భూమి కొరత అభివృద్ధికి అడ్డంకి కాకూడదని సిఎం స్పష్టం చేశారు. ప్రతి ప్రభుత్వ శాఖ, జిల్లా కలెక్టర్ స్పష్టమైన యాక్షన్ క్యాలెండర్ ను రూపొందించుకుని నిర్దేశిత గడువులోగా ఫలితాలు సాధించాలని తెలిపారు. కలెక్టర్ల సదస్సు కేవలం చర్చలకు మాత్రమే పరిమితం కాకుండా ఫలితాలను సాధించేలా ఉండాలన్నారు. జిల్లాల అధిపతులుగా కలెక్టర్లు అన్ని శాఖల అభివృద్ధి కార్యక్రమాలపై 360 డిగ్రీల కోణంలో దృష్టి సారించాలని అన్నారు. సమస్యల్ని ప్రస్తావించటం ఒక్కటే కాకుండా పరిష్కారం చూపేలా కలెక్టర్లు వేగంగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. బాధ్యతను మరొకరికి బదిలీచేసే తత్వాన్ని విడనాడాలని సూచించారు. ప్రతీ నెలా ఎస్ఐపిబి సమావేశాలు, ప్రతీ 15 రోజులకూ కేబినెట్ సమావేశంతో పాటు ప్రతీ మూడు నెలలకూ కలెక్టర్ల సదస్సు, ప్రతీ నెలా 4 రోజులు క్షేత్రస్థాయిలో ప్రజల దగ్గరకు వెళ్తున్నానని అన్నారు. ఎస్‌సి వర్గాలకిచ్చే ప్రయోజనాలను బుడగ జంగాలకు పొడిగించే అంశంపై తక్షణం ఉత్తర్వులు జారీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. బుడగ జంగాలకు ఎస్‌సి హోదా కల్పించే అంశం పెండింగులో ఉన్న నేపథ్యంలో ఎస్‌సిలకు కలిగే ప్రయోజనాలను వారికీ అందించాలని స్పష్టం చేశారు. త్వరలోనే మరో 1.5 లక్షల గృహాలు ఎపికి అదనంగా మంజూరు అయ్యే అవకాశం ఉందని వెల్లడించారు. రాష్ట్రంలో 50 శాతం హరిత ప్రాంతాన్ని సాధించేలా ప్లాంటేషన్ సీజన్ కు ముందే అవసరమైన 20 కోట్ల విత్తనాలను, మొక్కల్ని సిద్ధం చేసుకోవాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 905 స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించి కేంద్రంతో మాట్లాడాలని స్పష్టం చేశారు.








కామెంట్‌లు (0)