29న జాతీయ రహదారి దిగ్బంధనానికి పిలుపు
పొగాకు కొనుగోలుకు రూ.1,000 కోట్లు కేటాయించాలని డిమాండ్
రైతులను కాపాడే బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే: సంయుక్త కిసాన్ మోర్చా
కొండపి మండలంలో అనకర్లపూడి, పెరిదేపిలో బైక్ ర్యాలీ
ప్రజాశక్తి – కొండపి(ప్రకాశం): పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లభించే వరకు పోరాటం కొనసాగిద్దామని సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు పిలుపునిచ్చారు. పొగాకు కొనుగోలుకు ప్రభుత్వం రూ.1,000 కోట్లు కేటాయించి, ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని వారు డిమాండ్ చేశారు. ఈ మేరకు సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీ సంతనూతలపాడు మండలం మద్దులూరు నుంచి ప్రారంభమై కొండపి మండలంలోని అనకర్లపూడి, కొండపి, పెరిదేపి, మిట్టపాలెం, ముప్పవరం, చోడవరం, వెన్నూరు, కట్టుబడిపాలెం మీదుగా జరుగుమల్లి మండలంలోని నర్సింగోలు, రామచంద్రాపురం, పైడిపాడు, శతకుమాడు, కామేపల్లి, కొత్తపాలెం, పచ్చవ వరకు విజయవంతంగా సాగింది. ర్యాలీ సందర్భంగా గ్రామాల్లో సభలు నిర్వహించి పొగాకు రైతులను చైతన్యపరిచారు. అనకర్లపూడిలో వేముల వెంకట ప్రసాద్ ఆధ్వర్యంలో రైతులు యాత్ర బృందానికి ఘన స్వాగతం పలికారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో సంయుక్త కిసాన్ మోర్చా జిల్లా కన్వీనర్ చుండూరి రంగారావు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె. జయంతి బాబు, జిల్లా అధ్యక్షుడు హనుమారెడ్డి, ఉపాధ్యక్షుడు పరిటాల కోటేశ్వరరావు, నాయకులు సాగర్ తదితరులు పాల్గొని ప్రసంగించారు.
కొండపి పొగాకు బోర్డులో రైతులతో సమావేశమైన నాయకులు, అనంతరం పెరిదేపి గ్రామంలో రైతుల సమస్యల గురించి తెలుసుకున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని నిరసనగా అనకర్లపూడి గ్రామ వైస్ ఎంపీపీ, ఎంపీటీసీ వేముల వెంకట ప్రసాద్ తన పదవికి రాజీనామా చేసినట్లు ప్రకటించారు. అలాగే గతంలో టంగుటూరు మండలం పొందూరు గ్రామానికి చెందిన టీడీపీ ఎంపీటీసీ నాగేశ్వరరావు కూడా రైతుల సమస్యలపై తన పదవికి రాజీనామా చేసి ఉద్యమానికి మద్దతు తెలిపిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి జె. జయంతి బాబు మాట్లాడుతూ, పొగాకు రైతుల సమస్యల పరిష్కారం కోసం 90 రోజులుగా ఉద్యమిస్తున్నప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించలేదని విమర్శించారు. పొగాకు పంట ద్వారా కేంద్రానికి రూ.88 వేల కోట్ల ఆదాయం వస్తున్నప్పటికీ రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ముఖ్యమంత్రి కిలోకు రూ.200 కంటే తక్కువకు కొనుగోలు చేయవద్దని సూచించినా వ్యాపారులు దానిని పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29న టంగుటూరు వద్ద జాతీయ రహదారి దిగ్బంధనం నిర్వహిస్తామని, అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే 'చలో అమరావతి' కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. గతంలో కూడా ఉద్యమాల ద్వారా ప్రభుత్వాల నుంచి నిధులు సాధించుకున్నామని, ఈసారి కూడా రైతులంతా ఐక్యంగా ఉద్యమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఏజెంట్ల సింగయ్య, కేజీ మస్తాన్, చిన్న బ్రహ్మయ్య, గుమ్మళ్ల వెంకటేశ్వర్లు, లక్ష్మి, భారతి, వై. కృష్ణారావు, వెంకట్రావు, ఎం. నారాయణ, బాలు మల్లికార్జున, సీహెచ్ ప్రసాద్, రావిపాటి వెంకట్రావు, చెన్నారెడ్డి వెంకటేశ్వర్లు, పుట్టా రామారావు, సంయుక్త కిసాన్ మోర్చా నాయకులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన పొగాకు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.









కామెంట్‌లు (0)