శనివారం, 25 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

త్వరలో స్మార్ట్‌‌ఫోన్‌ ధరలకు రెక్కలు..!

1 గంట క్రితం

mobiles
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 12:57 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

- క్వాల్‌కామ్ చిప్‌ల ధరలు భారీగా పెంపు

శాన్‌ఫ్రాన్సిస్కో : అతి త్వరలోనే స్మార్ట్‌‌ఫోన్‌, ల్యాప్‌‌టాప్‌, ఇతర ఎలక్ర్టానిక్స్‌ ఉత్పత్తుల ధరలు భారీగా పెరిగే అవకాశాలున్నాయి. చిప్‌‌లను ఆయా తయారీ కంపెనీలు ధరలు పెంచడమే ఇందుకు ప్రధాన కారణం. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ ప్రాసెసర్ తయారీ సంస్థ క్వాల్‌కామ్ తన చిప్‌ల ధరలను రెండంకెల శాతం పెంచనున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 1 తర్వాత సరఫరా చేసే ఉత్పత్తులపై 10 శాతం కంటే ఎక్కువ కొత్త ధరలు అమల్లోకి వస్తాయని కంపెనీ వినియోగదారులకు పంపిన లేఖలో తెలిపింది. ముడి పదార్థాలు, సెమీకండక్టర్ భాగాల ధరలు పెరగడం, సరఫరా వ్యయం అధికమవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.

ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న సెమీకండక్టర్ కొరత క్వాల్‌కామ్‌పై కూడా తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) డేటా సెంటర్ల విస్తరణతో మెమరీ చిప్‌లు, ఇతర సెమీకండక్టర్ భాగాలకు భారీ డిమాండ్ ఏర్పడి, స్మార్ట్‌ఫోన్‌లు, కంప్యూటర్లు, ఆటోమొబైల్ రంగాల్లో సరఫరా సమస్యలు మరింత తీవ్రతరమయ్యాయి. దీంతో పెరిగిన ఉత్పత్తి వ్యయాన్ని వినియోగదారులపై మోపాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆ కంపెనీ ఆ వర్గాలు తెలిపాయి.​ క్వాల్‌కామ్ చిప్‌లను సామ్‌‌సంగ్‌, షావోమి వంటి ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీలతో పాటు మెటా, వేర్‌బుల్ పరికరాల్లో కూడా విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. అలాగే కంపెనీ తన చిప్‌ల తయారీకి ప్రధానంగా టిఎస్‌ఎంసిపై ఆధారపడుతోంది. ఇదే సంస్థ నుంచి ఆపిల్, ఎన్విడియా వంటి దిగ్గజాలు కూడా భారీ స్థాయిలో చిప్‌లను తయారు చేయించుకోవడంతో ఉత్పత్తి సామర్థ్యంపై తీవ్ర ఒత్తిడి కొనసాగుతోంది. ధరల పెంపు నిర్ణయం భవిష్యత్‌లో క్వాల్‌కామ్ ఆదాయాన్ని పెంచే అవకాశముందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. అయితే మరోవైపు ఈ నిర్ణయం స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థల ఉత్పత్తి వ్యయాన్ని పెంచి, రానున్న రోజుల్లో మొబైల్ ఫోన్లు సహా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాల ధరలు కూడా పెరిగే అవకాశాన్ని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్